Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణాలో వరద ఉధృతి : తిమ్మాపూర్ వాగులో నవవధువు గల్లంతు

తెలంగాణాలో వరద ఉధృతి : తిమ్మాపూర్ వాగులో నవవధువు గల్లంతు
, సోమవారం, 30 ఆగస్టు 2021 (09:01 IST)
తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా ఆ రాష్ట్రంలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ముఖ్యంగా, వాగులు, వంకలు, ఉప నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. తాజాగా వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఆదివారం కురిసిన వర్షానికి వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఈ వరద నీటికి ఆరుగురు గల్లంతయ్యారు. ముఖ్యంగా, తిమ్మాపూర్ వాగులో ఓ నవ వధువు కొట్టుకునిపోవడం విషాదంగా మారింది. 
 
వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన నవాజ్‌ రెడ్డి, ప్రవళిక అనే యువతీయువకులకు ఈ నెల 25వ తేదీన వివాహమైంది. ఆదివారం ఉదయం నవాజ్‌ రెడ్డి భార్య ప్రవళిక, తన అక్కలు రాధ, శ్వేత, ఆమె కుమారుడు ఇషాంత్‌ రెడ్డి (8), డ్రైవర్‌ రాఘవేందర్‌ రెడ్డిలతో కలిసి కారులో మోమిన్‌పేట్‌లోని అత్త వారింటికి వెళ్లారు. 
 
సాయంత్రం రావులపల్లికి తిరిగొస్తూ ఉధృతంగా ప్రవహిస్తున్న తిమ్మాపూర్‌ వాగును దాటేందుకు యత్నించారు. ప్రవాహ వేగానికి వారు ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. కారు తలుపు తెరుచుకుని బయటపడిన నవాజ్‌ రెడ్డి, రాధలు చేతికి అందిన చెట్ల కొమ్మలు పట్టుకోగా గ్రామస్తులు వారిని రక్షించారు. 
 
కానీ, ప్రవళిక, శ్వేత, ఇషాంత్‌రెడ్డి, రాఘవేందర్‌ రెడ్డిలు గల్లంతయ్యారు. పోలీసు, రెవెన్యూ, సహాయక సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయినప్పటికీ.. నవ వధువుతో పాటు.. మిగిలిన వారి ఆచూకీ ఇప్పటికీ గుర్తించలేకపోయారు. దీంతో వారు మృత్యువాతపడివుంటారని పోలీసులు భావిస్తున్నారు. 
 
మరో ఘటనలో రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొత్తపల్లి శివారులోని వాగులో ఆదివారం రాత్రి ఓ కారు గల్లంతయ్యింది. అందులో ఉన్న వికారాబాద్‌ జిల్లా ఎన్కతల గ్రామానికి చెందిన వెంకటయ్య (75) వాగులో కొట్టుకుపోగా, స్థానికుల సాయంతో సాయి, వినోద్‌, రమేశ్‌, శ్రీనివా్‌సలు ప్రాణాలతో బయటపడ్డారు. నవాబుపేట మండలంలో ఎల్లకొండ నుంచి గొల్లగూడ వెళ్లే మార్గంలో వాగును దాటే ప్రయత్నం చేసిన ఆటో కొట్టుకుపోతుండగా స్థానికులు పక్కనే ఉన్న ట్రాక్టర్‌ను అడ్డంగా నిలిపి ఆటో డ్రైవర్‌ను రక్షించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైజాగ్‌లో చింతమనేని అరెస్టు - పెట్రో ధరలపై ధర్నా చేసినందుకు..!