తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, చింతమనేని ప్రభాకర్‌ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో పెట్రో ధరలపై ధర్నా చేసినందుకుగాను ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో అరెస్టు చేసిన పోలీసులు పశ్చిమగోదావరి జిల్లాకు తరలించారు.
చింతమనేని అరెస్టుపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పెట్రో ధరలపై నిరసన తెలపడం నేరమా? ఇది ప్రజాస్వామ్యమా లేక ఆటవిక రాజ్యమా?' అని ప్రశ్నించారు. కేసులు, అరెస్టులతో తెదేపా నేతలను అడ్డుకోలేరన్న అచ్చెన్న.. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు.