ఆంధ్రప్రదేశ్ కలల రాష్ట్ర రాజధాని కేసు ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉందని వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఆంధ్రుల కలల రాజధాని కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందన్నారు.
ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు వేయడానికి కూడా కాంట్రాక్టర్లు ముందుకురాని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మూడు రాజధానుల నిర్మాణం సాధ్యంకాదని చెప్పారు.
విద్యుత్ కోతలతో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే విశాఖ ప్రజలు అర్థం చేసుకుంటారని చెప్పారు. ఇప్పటికైన సీఎం అర్థం చేసుకుని అమరావతిని రాజధానిగా ప్రకటించాలని సూచించారు.
మరోవైపు, వైసీపీ అధ్యక్ష పదవికి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిపితే ఆ పదవి కోసం జగన్‌పై పోటీకి తాను సిద్ధమని ఆయన ప్రకటించారు. పార్టీ నేతల మద్దతు తనకుందన్నారు. టీఆర్‌ఎస్ అధ్యక్ష పదవికి కేసీఆర్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతున్నారని, అదే తరహాలో వైసీపీకి కూడా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
జగన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల క్రమక్రమంగా ప్రజాదరణ కోల్పోతోందన్నారు. ఇటీవల తాను క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు తమ పార్టీ సిద్ధమైతే, తాను కూడా ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధమని తెలిపారు.
వైసీపీని బీజేపీ నాయకత్వం కేంద్ర మంత్రిమండలిలోకి తీసుకునే అవకాశమే లేదని స్పష్టం చేశారు. అథావలే వ్యాఖ్యలను సీరియ్‌సగా తీసుకోవలసిన అవసరమేలేదని కొట్టిపారేశారు. వైసీపీ నేతలు, ఎంపీలు రాష్ట్ర సమస్యలను గాలికొదిలేసి, తనపై అనర్హత వేటు వేయించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని రఘురామ విమర్శించారు.
జగన్ రెడ్డి ప్రజలకిచ్చిన హామీలను విస్మరిస్తున్నారని, ఆ హామీలను తాను గుర్తు చేస్తున్నందుకే అనర్హత వేటు వేయించే పనిలో ఉన్నారని ఆరోపించారు. సినిమా థియేటర్లకు లేని కొవిడ్ ఆంక్షలు.. దేవాలయాలకు ఎందుకని ప్రశ్నించారు.