ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్వామిజీల ఆశ్రయాలను సందర్శించడం అరుదు. సందర్శిస్తే ఎక్కువగా విశాఖ శారదాపీఠాన్ని ఎంచుకుంటారు. అయితే అనూహ్యంగా ఈ సారి విజయవాడలో ఉన్న గణపతి సచ్చిదానంద ఆశ్రమాన్ని సందర్శించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో అలా ఓ సారి ఆశ్రమానికి వెళ్లారు. అయితే కరకట్ట మీద ఉన్న ఆశ్రమానికి వెళ్లారు.
విజయవాడలోని దత్తనగర్‌లో ఉన్న ఆశ్రమానికి వెళ్లలేదు. ఇప్పుడు దత్తనగర్ ఆశ్రమానికి వెళ్తున్నారు. ఆశ్రమంలో ఉన్న ఆలయాలను చూస్తారు. మరకత రాజరాజేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత స్వామిజీతో సమావేశం అవుతారు.
ఈ పర్యటన ఉద్దేశం ఏమిటో వైసీపీ నేతలకు కూడా అర్థం కావడం లేదు. ఆశ్రమంలో ఏదైనా ఉత్సవాలు జరిగితే వెళ్లి తీర్థప్రసాదాలు స్వీకరించి రావడం సహజమే. కానీ ప్రత్యేకంగా ఏ కార్యక్రమం లేదు.. దసరా ఉత్సవాలు కూడా ముగిసిపోయిన తర్వాత ఆయన ఆశ్రమాన్ని ఎందుకు సందర్శిస్తున్నారన్నది ఇతర రాజకీయ పార్టీలకు కూడా పజిల్‌గా మారింది. అందుకే అందరూ ఇదంతా ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగం అంటూ ఊహాగానాలు ప్రారంభించేశారు.