తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
స్వామివారి దర్శనానంతరం శ్రీ వకుళామాతను, ఆలయ ప్రదక్ష్షిణగా వచ్చి శ్రీ విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, భాష్యకార్ల సన్నిధి, శ్రీ యోగనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అలాగే శ్రీవారి దర్శనానంతరం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆలయంలోని తులాభారం మొక్కు తీర్చుకున్నారు.
శ్రీవారి అనుగ్రహంతో కోరికలు తీరిన భక్తులు తమ బరువుకు సమానంగా బెల్లం లేదా బియ్యం లేదా ఇతర ధాన్యాలతో తూకం వేసి స్వామివారికి సమర్పించడం ఆనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తన బరువుకు సమానంగా 78 కిలోల బియ్యం తులాభారంలో సమర్పించి మొక్కు చెల్లించారు.