ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఏఐ ఫర్ ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్ 2025లో తెలంగాణకు చెందిన టెక్నాలజీ సంస్థ క్వాడ్రిక్ ఐటీ రెండో స్థానంలో నిల్చింది. కృత్రిమ మేథను ఉపయోగించి ప్రజాపాలన, సంరక్షణే లక్ష్యంగా ఆ సంస్థ బ్లూ క్వయిరీ అనే ప్రాజెక్టును ప్రదర్శించింది. ఆ సంస్థకు నేతృత్వం వహిస్తున్న రఘురామ్ తాటవర్తి ఆధ్వర్యంలో ఈ ఘనత సాధ్యమైంది. ఇంగ్లీష్, తెలుగు భాషలను ఉపయోగించిన ఈ ప్రాజెక్టు కేసుల విచారణకు ఉపయోగడేలా క్వాడ్రిక్ సంస్థకు చెందిన సుజయ్ అనిశెట్టి, సాయి అజిత్ భరద్వాజ్ రూపొందించారు. ఈ ప్రాజెక్టును రఘురామ్ తాటవర్తి, కేసరి సాయి కృష్ణ, సబ్నీ వీసు, కమల్ చంద్ కొత్త, ప్రియతమ్ తాటవర్తి పర్యవేక్షించారు.
దేశం నలుమూలల నుంచి 57 సంస్థలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రజా భద్రతా, పోలీసింగ్ సవాళ్లను ఎదుర్కొవటం, విపత్కర పరిస్థితుల్లో కృత్రిమ మేథ ఉపయోగం వంటి అంశాలపై సంస్థలు తమ ప్రాజెక్టుల్ని రూపొందించాయి. గట్టి పోటీ మధ్య క్వాడ్రిక్ రెండో విజేతగా నిల్చింది. బ్లూ క్వయిరీని పూర్తి ప్రాజెక్టుగా వృద్ధి చేసేందుకు సహకరిస్తామని ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం స్పష్టం చేసింది. క్వాడ్రిక్ ఐటీ సంస్థను అభినందించిన ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత...మరిన్ని ఆవిష్కరణలు చేయాలని ఆ సంస్థను కోరారు.
ఈ విజయం కేవలం గుర్తింపు, ఆవిష్కరణ మాత్రమే కాదు తమ సంస్థపై మరింత బాధ్యతను పెంచిందని రఘురామ్ తాటవర్తి అన్నారు. కృత్రిమ మేథ సమాజంలోని సమస్యల్ని పరిష్కరించటానికి ఉపయోగపడాలని అభిలాషించారు. తమ సంస్థ మరిన్ని ఆవిష్కరణల్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తుందని చెప్పారు. ఈ ఘనత సాధించిన క్వాడ్రిక్ ఐటీ టీమ్ ని ఆయన అభినందించారు.