ఏపీ లిక్కల్ స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయి జైల్లో ఉన్న వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యక్తిగత సహాయకులను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అదుపులోకి తీసుకుంది. కొన్నాళ్లుగా అజ్ఞాతంలో ఉన్న పీఏలు బాలాజీ, నవీన్‌లను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు, ఈ కేసు దర్యాప్తును సిట్ బృందం వేగవంతం చేసింది. కేసులో అరెస్టు చేసిన చెవిరెడ్డి, ఆయన అనుచరుడు వెంకటేశ్ నాయుడులను మంగళవారం నుంచి మూడు రోజుల పాటు కస్టడీలికో తీసుకుని విచారించనున్నారు.
ఎన్నికల సమయంలో తెలంగాణ నుంచి ఏపీ సరిహద్దులకు రూ.8.20 కోట్ల నగదును బాలాజీ తీసుకొచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో ఎన్నికల సంఘం ఆ సొమ్మును స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో చెవిరెడ్డి పేరు వెలుగులోకి రావడంతో ఆయన పీఏలుగా పని చేసిన బాలాజీ, నవీన్‌లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
అయితే, వారు ఇండోర్ నుంచి ఏపీలోని వైకాపా నేతలకు ఫోన్లు చేస్తూ కేసు పురోగతి, వాస్తవ పరిస్థితిని ఎప్పటికపుడు తెలుసుకుంటూ ఉండటంతో సెల్ ఫోన్ సిగ్నల్, లొకేషన్ ఆధారంగా సిట్ పోలీసులు వారి ఆచూకీని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సిట్ అధికారులు ఇండోర్‌కు వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు.