తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామివారికి ఆదివారం టిటిడి ధరకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్ సింఘాల్ కలిసి పట్టువస్త్రాలు సమర్పించారు.
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టిటిడి ఛైర్మన్, ఈవోకు శ్రీరంగం ఆలయ ఛైర్మన్ వేణు శ్రీనివాసన్, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఛైర్మన్, ఈవో పట్టువస్త్రాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి సమర్పించారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను టిటిడి ఛైర్మన్ కు, ఈవోకు అందజేశారు.
కైశిక ఏకాదశిని పురస్కరించుకుని 2006వ సంవత్సరం నుంచి శ్రీరంగం ఆలయానికి టిటిడి పట్టువస్త్రాలు సమర్పిస్తోంది. ప్రాచీన శ్రీవైష్ణవాలయాలతో ఆధ్యాత్మిక సంబంధాలను కొనసాగించేందుకు టిటిడి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ బొక్కసం ఇన్‌చార్జి గురురాజారావు తదితరులు పాల్గొన్నారు.