Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కన్నవారిని కలిపిన ఫేస్‌బుక్‌.. 13 ఏళ్ల కిందట తప్పిపోయిన బాలిక అమ్మానాన్నల చెంతకు

కన్నవారిని కలిపిన ఫేస్‌బుక్‌.. 13 ఏళ్ల కిందట తప్పిపోయిన బాలిక అమ్మానాన్నల చెంతకు
, సోమవారం, 9 డిశెంబరు 2019 (07:45 IST)
నాలుగేళ్ల వయసులో తప్పిపోయి అమ్మానాన్నలకు దూరమైంది. చిన్ననాటి జ్ఞాపకాలను పదిలపర్చుకుని.. పదమూడేళ్ల అనంతరం వారి జాడ తెలుసుకుంది.  కన్నవారిని కలుసుకోబోతున్నాననే ఆనందం ఒకవైపు.. 13 ఏళ్లపాటు సొంత బిడ్డలా పెంచి.. చదువు చెప్పించిన తల్లి దూరమవుతోందనే బాధ మరోవైపు ఆమెను చుట్టుముట్టాయి.

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం చీపురుపల్లి గ్రామానికి చెందిన కోడిపెంట్ల మాధవరావు, వరలక్ష్మి దంపతులు బతుకుదెరువు కోసం 14 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ వెళ్లారు. ఆ దంపతులకు ముగ్గురు సంతానం. మాధవరావు, వరలక్ష్మి దంపతులు 2006 నవంబర్‌లో ముగ్గురు బిడ్డల్ని ఇంటివద్దే ఉంచి కూలి పనులకు వెళ్లారు.

వారి కుమార్తె భవానీ  తన అన్నయ్యలు సంతోష్, గోపీతో ఆడుకుంటూ తప్పిపోయింది. రోడ్డుపై బిక్కుబిక్కుమంటూ రోదిస్తున్న భవానీని జయరాణి (జయమ్మ) అనే మహిళ చేరదీసి ఆమె తల్లిదండ్రుల కోసం చుట్టుపక్కల వాకబు చేసింది. ఫలితం లేకపోవడంతో అప్పట్లోనే సనత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసి.. భవానీ సంబంధీకులు వచ్చేవరకు ఆమెను తానే సాకేందుకు ముందుకొచ్చింది.

భవానీని పెంచి ఇంటర్మీడియెట్‌ వరకు చదివించింది. భవానీకి ప్రస్తుతం 17 ఏళ్లు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన జయరాణి (జయమ్మ) గతంలో హైదరాబాద్‌లో ఉంటూ అక్కడి ఇళ్లల్లో పని చేస్తుండేది. కొంతకాలం క్రితం కుటుంబ సభ్యులు, భవానీతో కలిసి విజయవాడ వచ్చి ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.

తాను పని చేస్తున్న ఇంట్లోనే భవానీని కూడా పనిలో పెట్టాలనే ఉద్దేశంతో ఇంటి యజమాని వంశీ, భార్య కృష్ణకుమారి వద్దకు  భవానీని తీసుకెళ్లింది. భవానీ వివరాలను ఇంటి యజమాని వంశీ ఆరా తీశారు. తాను చిన్నతనంలోనే తప్పిపోయానని తెలిపిన భవానీ తల్లిదండ్రుల పేర్లు, అన్నల పేర్లను, గుర్తున్న చిన్ననాటి సంగతులను చెప్పింది.

ఆ వివరాలను, భవానీ ఫొటోను వంశీ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. శనివారం ఆ పోస్ట్‌ను చూసిన భవానీ అన్న.. వంశీకి వీడియో కాల్‌ చేశాడు.  

అన్నయ్యను భవానీ గుర్తు పట్టింది. ఆ తరువాత ఆమె తల్లిదండ్రులు కూడా భవానీతో వీడియో కాల్‌ మాట్లాడారు. కుమార్తెను తీసుకెళ్లడానికి చీపురుపల్లి నుంచి తల్లిదండ్రులు మాధవరావు, వరలక్ష్మి, సోదరులు సంతోష్, గోపీ విజయవాడ బయలుదేరారు.

ఇదిలావుంటే.. గతంలో హైదరాబాద్‌లో  జీవనోపాధి పొందిన భవానీ తల్లిదండ్రులు ప్రస్తుతం  చీపురుపల్లిలోనే ఉంటున్నారు. తమ బిడ్డ  ఆచూకీ తెలిసి భవానీ తల్లిదండ్రులు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. ఇంత కాలం తల్లిగా మారి భవానీని కంటికి రెప్పలా చూసుకుంటూ చదువు చెప్పించిన జయమ్మకు రుణపడి ఉంటామని చెప్పారు. ఇన్నాళ్లకు భవానీ అమ్మా నాన్నలకు దగ్గరవుతుండటంతో చీపురుపల్లి గ్రామమంతా సంతోషం వ్యక్తం చేసింది.
 
భవానీని అప్పగించడంలో ట్విస్ట్‌
నాలుగేళ్ల వయసులో తప్పిపోయిన భవానీని తల్లిదండ్రులకు అప్పగించడంలో కొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. భవానీని తల్లిదండ్రుల వద్దకు పంపించేందుకు పెంచిన తల్లిదండ్రులు జయమ్మ-జీవరత్నం అభ్యంతరం తెలిపారు. వచ్చినవారు అసలైన తల్లిదండ్రులని నిర్ధారణ కావాలని.. అప్పుడే తనను వారి వద్దకు పంపుతామని జయమ్మ చెప్పారు.

అందుకోసం డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. భవానీ అభీష్టంతోనే తల్లిదండ్రుల వద్దకు పంపిస్తామని వెల్లడించారు. భవానీని అప్పగించే విషయంపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని అన్నారు. పోలీసుల సూచనల మేరకు నడుచుకుంటామని చెప్పారు. వచ్చినవారే నిజమైన తల్లిదండ్రులని నిర్ధారణ అయ్యాకే అప్పగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు భవానీ మాత్రం తన తల్లిదండ్రుల వద్దకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

ఇందుకోసం ఏ పరీక్షలకైనా సిద్ధమేనని వెల్లడించారు. అప్పుడప్పుడు జయమ్మ వద్దకు కూడా వస్తానని చెప్పారు. కాగా, వంశీ, కృష్ణకుమారి దంపతుల ఇంట్లో భవానీని పనిలో పెట్టాలనే ఉద్దేశంలో జయమ్మ ఆమెను వారివద్దకు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.

అక్కడ ఇంటి యజమాని వంశీ.. భవానీ వివరాలను ఆరా తీశారు. తాను చిన్నతనంలోనే తప్పిపోయానని తెలిపిన భవానీ తల్లిదండ్రుల పేర్లు, అన్నల పేర్లను, గుర్తున్న చిన్ననాటి సంగతులను చెప్పారు. ఆ వివరాలను, భవానీ ఫొటోను వంశీ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.

శనివారం ఆ పోస్ట్‌ను చూసిన భవానీ అన్న.. వంశీని సంప్రదించాడు. 13 ఏళ్ల తరువాత తమ బిడ్డ  ఆచూకీ తెలిసి భవానీ తల్లిదండ్రులు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. 

పడమట పోలీస్‌ స్టేషన్‌కు చేరిన భవానీ వివాదం..
భవానీని అప్పగించడానికి పెంచిన తల్లిదండ్రులు జయమ్మ-జీవరత్నం అభ్యంతరం తెలుపడంతో ఈ వివాదం పటమట పోలీస్‌ స్టేషన్‌కు చేరింది. దీంతో పోలీసులు ఓ వైపు కన్న తల్లిదండ్రులు, మరోవైపు పెంచిన తల్లిదండ్రుల సమక్షంలో వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే తాము డీఎన్‌ఏ పరీక్షలకు సిద్ధంగా ఉన్నట్టు భవానీ సోదరుడు గోపి తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కవితకు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం