Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రాణాంతక వ్యాధి బాలిక కోరిక నెరవేరినవేళ...!

ప్రాణాంతక వ్యాధి బాలిక కోరిక నెరవేరినవేళ...!
, బుధవారం, 30 అక్టోబరు 2019 (18:24 IST)
మన చుట్టూ అందమైన ప్రపంచ ఉంది. అందమైన మనుషులు ఉన్నారు. అందమైన జీవితాలు కూడా ఉన్నాయి. అయితే కొన్ని జీవితాలను పరికించి చూస్తే విధి వారితో విచిత్రంగా ఆడుకుంటుంది. అందుకే జీవితం అనే నాటక రంగంలో కొందరు కేవలం పాత్రలకే పరిమితమైపోతారు. అటువంటి కథనే కాదు జీవితాన్నే మీకు పరిచయం చేస్తున్నాం. పిల్లలను మనం పెద్ద అయిన తరువాత ఏం అవుతావు అంటే... డాక్టర్ అనో, లేదా సైంటిస్ట్ అనో లేదంటే పోలీస్ ఆఫీసర్ అవుతాననో చెపుతారు. పాపం రమ్య కూడా అలానే కలకన్నది. 
 
సీతాకోక చిలుకలా తిరుగుతూ చదువులో అందరికంటే ముందు వరుసలో ఉంటూ ఎప్పుడూ నవ్వుతూ తన ప్రక్క ఉన్న వారిని నవ్విస్తూ ఉండేది. తాను పెద్ద అయిన తరువాత పోలీస్ కమిషనర్ అవుతానని తరుచూ అమ్మానాన్నలకు  చెబుతూ ఉండేది. రమ్య తను ఒకటి తలిస్తే విధి మరోలా తలచింది. బ్లడ్ కేన్సర్ అనే ప్రాణాంతక వ్యాధి రమ్యను కబళిస్తోంది. అయితే ఆమె శరీరానికి కేన్సర్ మహమ్మరి సోకింది కానీ ఆమె కన్న కలలకు కాదు.
 
అందుకే పోలీస్ కమిషనర్ అవ్వాలన్న ఆమె ఆశయాన్ని రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ నెరవేర్చారు. వివరాలు పరిశీలిస్తే... అల్వాల్‌కు చెందిన నర్సింహ, పద్మ దంపతుల కుమార్తె రమ్య(17) ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కొంతకాలంగా లుకేమియా అనే 
 
బ్లడ్‌ కేన్సర్‌తో బాధపడుతుంది. అయితే ఆమె జీవిత ఆశయాన్ని తల్లిదండ్రలు ద్వారా తెలుసుకున్న మేక్‌ ఏ విష్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ను కలిసి రమ్య కోరికను వివరించారు. ఇందుకు సీపీ సానుకూలంగా స్పందించారు. దీంతో మంగళవారం ఫౌండేషన్‌ ప్రతినిధులు, తల్లిదండ్రులు, రమ్యను కమిషనరేట్‌కు తీసుకువెళ్లి సీపీ మహేష్‌భగవత్‌ను కలిశారు. 
 
అంతేకాదు రమ్యకు పోలీస్ యూనిఫామ్ కుట్టించి అందించారు మహేష్ భగవత్. పోలీస్‌ యూనిఫాంలో కమిషరేట్‌కు వచ్చిన రమ్యకు కార్యాలయం సిబ్బంది, అధికారులు గౌరవ వందనం చేశారు. రాచకొండ కమిషనర్‌గా మహేష్‌ భగవత్‌ రమ్యకు బాధ్యతలు అప్పగించారు. 
 
అనంతరం సీపీ ఆమెను స్వయంగా కమిషనర్‌ కుర్చీలో కూర్చోబెట్టారు. రిజిస్టర్‌లో సంతకం చేసి, ఒక రోజు కమిషనర్‌గా రమ్య విధులు నిర్వర్తించారు. ఒక రోజు రాచకొండ కమిషనర్‌గా పని చేయడం చాలా సంతోషంగా ఉందని తెలియజేసింది రమ్య. రాచకొండ కమిషనర్‌ మహేష్‌భగవత్‌ను మేక్ ఏ విష్ ఫౌండేషన్ సభ్యులను రమ్య జీవిత ఆశయం నెరవేర్చినందుకు నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉద్యోగాలు ప్లీజ్... గవర్నర్ కు జేఏసీ నేతల విజ్ఞప్తి