ఎపి సరిహద్దుల్లో ఎస్‌ఇబి, పోలీసులు చేపట్టిన తనిఖీల్లో కళ్లు చెదిరే వెండి బయటపడటంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. గంజాయి, అక్రమ మద్యం, హవాలా డబ్బు, బంగారం వంటి అక్రమాలకు చెక్ పెడుతూ పోలీసులు ఇటీవల తనిఖీలు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారీగా డబ్బు, బంగారం, అక్రమ మద్యం పట్టుబడుతోంది.
తాజాగా పంచాయతీ ఎన్నికలు కూడా ఉండటంతో ఈ సోదాలు మరింత ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న వెండిని పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. వడమాలపేట మండలం ఎస్‌వి.పురం టోల్ ప్లాజా దగ్గర పోలీసులు చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు.
తనిఖీల్లో భాగంగా శనివారం ఉదయం తమిళనాడుకు చెందిన కారులో సోదాలు చేపట్టగా.. అందులో 57 కేజీల వెండి ఆభరణాలతో పాటు తుపాకీ ఉన్నట్లు గుర్తించారు. ఆభరణాల విలువ రూ.41,99,164 ఉంటుందని అంచనా వేస్తున్నారు. కారుతో సహా 57 కిలోల వెండిని, తుపాకిని స్వాధీనం చేసుకున్నారు.
కాగా, ఈ వెండి ఆభరణాలను చెన్నైలోని లలితా జ్యువెలరీ నుంచి తిరుపతిలోని లలితా జ్యువెలరీకి తీసుకువస్తున్నట్లు కారు డ్రైవర్ డాక్యుమెంట్లను పోలీసులకు చూపించారు. అయితే, రసీదులు సక్రమంగా ఉన్నాయా? లేదా? అని తెలుసుకోడానికి పోలీసులు పుత్తూరు కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయానికి పంపారు. కారులో ఉన్న తుపాకీకి లైసెన్స్ ఉన్నప్పటికీ స్థానిక ఎన్నికలు ఉండటంతో సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.