సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలంటే తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. ఎంత ఖర్చయినా ఫర్వాలేదు ప్రైవేటు పాఠశాలలోనే చదివించాలని అనుకుంటుంటారు తల్లిదండ్రులు. కానీ నిరుపేదలు మాత్రం వేరే మార్గం లేదు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలకే తమ పిల్లలను పంపిస్తుంటారు. ప్రతి యేడాది విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చేరే వారి సంఖ్య తగ్గిపోయి ప్రైవేటు పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది.
కానీ అందుకు విరుద్ధంగా చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కొత్ల ఇండ్లులోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు పరిమితికి మించి చేరారు. ఈ పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. గత సంవత్సరం 850 మంది విద్యార్థులు ఈ పాఠశాలల్లో విద్యనభ్యసించగా ఈ యేడాది ఏకంగా 1022 మంది చేరారు.
చుట్టుప్రక్కల గ్రామాల నుంచి కూడా అడ్మిషన్ల కోసం విద్యార్థులు వస్తూనే ఉండటంతో అడ్మిషన్లు ఆపేశారు. సీట్లు లేవంటూ పాఠశాల ముందు బ్యానర్ కూడా కట్టేశారు. పాఠశాలలో క్రమశిక్షణతో పాటు విద్యార్థులకు ప్రత్యేకంగా ట్యూషన్లు కూడా నడుపుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను నడుపుతుండటంతో తల్లిదండ్రులు ఈ పాఠశాలలలోనే తమ పిల్లలను చేర్పించేందుకు పోటీలు పడుతున్నారు.