ఒంగోలులో నిర్భయ : ఆటోలో మహిళపై గ్యాంగ్‌రేప్

శనివారం, 25 జనవరి 2020 (10:39 IST)
దేశరాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ అత్యాచార కేసులోని దోషులుగా తేలిన కామాంధులకు వచ్చే నెల ఒకటో తేదీన ఉరిశిక్షలు అమలయ్యే అవకాశం ఉంది. ఇపుడు నిర్భయ కేసు తరహాలోనే ఒంగోలు జిల్లాలో ఓ గ్యాంగ్ రేప్ జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళపై ఆటో డ్రైవర్‌తో పాటు.. ముగ్గురు ప్రయాణికులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్‌లో చీమకుర్తికి చెందిన ఓ వ్యక్తి ఆటో ఎక్కాడు. అతడు పీకల వరకు మద్యం సేవించివున్నాడు. దీంతో అతను నిలబడటం సంగతి అటుంచితే సరిగా కూర్చోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ క్రమంలో అతని వద్ద ఉన్న డబ్బులు దోచుకునేందుకు ఆటో డ్రైవర్ ప్లాన్ చేశాడు.
 
ప్రయాణికుడితో కలసి కేశవరాజుకుంటవైపు బయలుదేరిన డ్రైవర్.. తన మిత్రుడికి ఫోన్ చేసి విషయం చెప్పి దారిలో సిద్ధంగా ఉండమన్నాడు. దారిలో తనకు పరిచయం ఉన్న వివాహిత కనబడడంతో ఆమెను కూడా ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత మిత్రుడిని కూడా ఎక్కించుకుని చినమల్లేశ్వర కాలనీ శివారుకు తీసుకెళ్లాడు. అక్కడ అందరూ కలిసి మద్యం తాగారు.
 
అనంతరం ఆటోలో ఉన్న వివాహితపై ప్రయాణికుడు సహా అందరూ అత్యాచారం చేశారు. బాధితురాలు అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆమె వివస్త్రగా ఉండగానే బయటకు లాగి పడేశారు. ఈ క్రమంలో ఆమె తలకు తీవ్ర గాయమైంది.
 
అనంతరం బాధితురాలి వద్ద ఉన్న సెల్‌ఫోన్ తీసుకున్న డ్రైవర్.. అందులోని సిమ్‌ను తీసి పడేసి, తన సిమ్ వేసుకున్నాడు. తర్వాత ముగ్గురూ అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కేసులో ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ ఘటనకు ముందు ఆమెతో ఫోన్లో మాట్లాడిన నలుగురిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం బడ్జెట్‌కు ముందు కేంద్రం తీపి కబురు : ప్రైవేటు ఉద్యోగులకు కనీస పెన్షన్