వచ్చే నెల ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం 2020-21 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తులు చేస్తోంది. ఈ బడ్జెట్‌కు ముందు ప్రైవేటు రంగ సంస్థల్లో పని చేస్తున్న కార్మికులకు కేంద్రం ఓ తీపి కబురు చెప్పింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ప్రస్తుతం వెయ్యి రూపాయలుగా ఉన్న ఈపీఎఫ్ కనీస పెన్షన్ ఇకపై ఆరు వేల రూపాయలకు పెంచనుంది. ఈ మేరకు కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం.
వచ్చే నెల ఒకటో తేదీన ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని పొందుపరిచినట్టు వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈపీఎఫ్ పింఛన్‌ను పెంచాలంటూ ఉద్యోగ సంఘాలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు వారి డిమాండ్ నెరవేరే రోజు అతి దగ్గరలోనే ఉంది.
దీంతోపాటు గతంలో అమల్లో ఉన్న కమ్యుటేషన్ పద్ధతిని తిరిగి తీసుకురావాలని కూడా కేంద్రం భావిస్తోంది. ఇది అమల్లోకి వస్తే రిటైర్మెంట్ సమయంలో పీఎఫ్‌తోపాటు పెన్షన్‌లోని కొంత మొత్తాన్ని కూడా తీసుకునే వీలు చిక్కుతుంది. అయితే, అలా తీసుకున్న పక్షంలో నెలవారీ పెన్షన్ 15 ఏళ్లపాటు మూడోవంతుకు తగ్గిపోతుంది. ఈ పద్ధతిని అమల్లోకి తీసుకొస్తే 6.5 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది.