Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైతులను మోసం చేస్తే సహించేది లేదు: మంత్రి కన్నబాబు

రైతులను మోసం చేస్తే సహించేది లేదు: మంత్రి కన్నబాబు
, శనివారం, 21 మార్చి 2020 (09:07 IST)
రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం సాకుతో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రాకుండా దళారులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు హెచ్చరించారు. సచివాలయంలోని ప్రచార విభాగంలో మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడారు.

కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రాకుండా మార్కెట్లను మూసివేస్తున్నారని దుష్ప్రచారాన్ని పట్టించుకోవద్దని మంత్రి కన్నబాబు సూచించారు. కొందరు దళారులు  కుట్రలు పన్నుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని అన్నారు.

రాష్ట్రంలో అన్ని రకాల మార్కెట్లు మూత పడతాయని దళారులు ప్రచారం చేస్తున్న తరుణంలో రైతులకు ఆయా శాఖల అధికారులు అవగాహన కల్పించి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. ప్రధానంగా బొప్పాయి, అరటి, సపోటా, జొన్న, మొక్కజొన్న వంటి ఆహార పంటల ధరలు మార్కెట్లో పడిపోయిన నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకోని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చామని మంత్రి కన్నబాబు ప్రకటించారు.

వీలుంటే పంటలను వారం రోజులు పాటు కోతలు కోయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఒకవేళ పంటలను కోసినట్లైతే వాటిని గోదాములకు తరలించి భద్రపరుచుకోవాలన్నారు. దళారుల మాటలను నమ్మి పంటలను అమ్ముకోవద్దని మంత్రి సూచించారు. అన్ని మార్కెట్లను పూర్తిగా శుభ్రం చేయిస్తున్నామని, రైతులకు అధికారులకు మాస్క్ లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. రైతుల కోసం సంరక్షణ చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

కొందరు దళారులు కరోనా బూచిని చూపి రైతుల పంటలను తక్కువ ధరకు కొగోలు చేసి ఎక్కువ ధరలకు అమ్ముకొని సొమ్ము చేసుకోవాలని విఫల ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో జొన్న, మొక్కజొన్న పంటల కొనుగోలు కేంద్రాలను తెరుస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో రైతులు, వ్యాపారులతో ఉమ్మడి సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.

దీనివల్ల స్పష్టత వస్తుందని అన్నారు. గతంలోనే అరటికి రూ.800లు మద్దతు ధరను ప్రకటించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. అనంతపురంలో రైతులు పండించిన అరటి ధరలు కరోనా నేపథ్యంలో క్షీణదశకు చేరిన విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇతర (ప్రాంతాలు)రాష్ట్రాలలో మార్కెట్లు మూసివేయడంతో ఈ సమస్య తలెత్తిందని పేర్కొన్నారు.

రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని వెల్లడించారు. గిట్టుబాటు ధరలు కల్పించేందుకు తగిన చర్యలను తీసుకుంటామని ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని మార్కెట్లు శుభ్రపరుస్తున్నామని, తగిన వసతులు కల్పిస్తున్నామన్నారు. రైతులు,అధికారులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ సూచనలు,సలహాలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలిచ్చామన్నారు.

దీంతో పాటుగా రైతులు, రవాణాశాఖ వారితో త్వరలో ఉమ్మడి సమీక్షను నిర్వహిస్తామని ప్రకటించారు. తద్వారా రైతులు తమ పంటలను సకాలంలో రవాణాశాఖతో సమన్వయ పరుచుకొని పంటలను అమ్ముకునే వీలు ఏర్పడుతుందని అన్నారు. రాష్ట్రంలో సాధారణ రైతులు ఎవ్వరూ ఇబ్బందులు పడకుండా ఇప్పటికే ప్రభుత్వం మద్దతు(ఎమ్మెస్పీ) ధరలను ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు.

రైతులు ఎవ్వరూ ఇబ్బందులు పడవద్దని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.రానున్న వేసవిలో పశువుల మేతకు కొరత రాకుండా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఫోడర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని  సంబంధిత శాఖాధికారులను ఆదేశించినట్లు వివరించారు.రానున్న ఖరీఫ్ లో వ్యవసాయానికి సన్నద్ధమవ్వాలని అధికారులను కోరారు.ఇందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో 4 వేల మేర రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

మరో 4వేల రైతుభరోసా కేంద్రాలను ఏప్రిల్ చివరి నాటికి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. మొత్తం 11,158 రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు అవుతాయని తెలిపారు. ఇప్పటికే కియోస్క్, సాఫ్ట్ వేర్ సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.తద్వారా విత్తనం అందించడంతో పాటుగా ఉత్పత్తులు కొనేవరకు రైతుభరోసా కేంద్రాలు ఒక ఫెసిలిటీ కేంద్రాలుగా పని చేస్తాయని అన్నారు. 

జూన్ మొదటి వారంలోరైతుభరోసా కేంద్రాల ద్వారా అన్నిరకాల విత్తనాలు,ఎరువులు రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అక్కడే అన్నిరకాల పంటల వివరాలు తెలుసుకొని పంటలు వేసుకొని సాగు చేసుకునేలా రైతుల కోసం నాలెడ్జ్ సెంటర్ లా తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. మట్టి నమూనాల దగ్గర నుంచి ప్రతీ అంశం రైతులకు రైతుభరోసా కేంద్రాల ద్వారానే తెలుసుకునేలా వీలు కల్పిస్తామని పేర్కొన్నారు.

దీనిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని వివరించారు. రైతుల సంక్షేమం కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేయాడానికి వెనుకాడబోమని చెప్పారన్నారు. కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ భూమి తక్కువగా ఉందని అక్కడ రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరంపై అధికారులు సిఎం దృష్టికి తీసుకురాగా ముఖ్యమంత్రి రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందేనని ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు.

దీంతో పాటుగా ఈ-క్రాప్ విధానం ఇప్పటికే అమలు చేస్తున్న విషయాన్ని మంత్రి కన్నబాబు గుర్తుచేశారు. కౌలురైతులకు పంటరుణాలు ఇచ్చే విషయంపై బ్యాంకర్లతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షను నిర్వహించి రుణాలను సకాలంలో ఇచ్చేందుకు సన్నాహాలు చేయాలని తెలిపారని అన్నారు.ఇందుకోసం కౌలురైతులకు కూడా లక్ష్యం సాధించే దిశగా రుణాలు పంపిణీ జరిగేలా అధికారులకు ఆదేశాలిచ్చామని తెలిపారు.

త్వరలో జిల్లాస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. గుర్తింపు కార్డులను ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారని అన్నారు.ఈ-క్రాప్ బుకింగ్ తప్పని సరిచేశాని గుర్తు చేశారు.దీనివలన ప్రతీ రైతు తన పంటను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు.దీనివలన రైతులకు అన్ని రకాల ప్రభుత్వ పధకాలు అందుతాయని అన్నారు.

రైతులు ప్రతీ ఏటా ఈ-క్రాప్ విధానంలో పంటలను వేసేలా అవగాహన కల్పిచే పనిలో భాగంగా వ్యవసాయశాఖ, రెవెన్యూశాఖల అధికారులు సమీక్ష నిర్వహించుకొని క్షేత్రస్థాయిలో పనిచేస్తారని పేర్కొన్నారు. వైట్ ఫ్లై వైరస్ నివారణకు కొబ్బరి,ఆయిల్ ఫాంలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. రైతుల్లో అవగాహన కల్పించి నివారణ చర్యలను చేపడతామని అన్నారు.

ఉద్యానవనశాఖ, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో వైట్ ఫ్లై వైరస్ నివారణకు క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆదేశాలిచ్చామని తెలిపారు. కడియం నర్సరీ, ఇతర ప్రాంతాల నర్సరీల నుంచి వచ్చే మొక్కలకు స్ర్కీనింగ్ చేపుకొని పంపాలన్నారు.

ఇటీవల జామ మొక్కల పెంపకం వలన రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తమ దృష్టికి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్ళల్లో ఏఏ పంటలు ఎన్నిఎకరాల్లో వేస్తున్నారో తెలుసుకొని రైతులకు గిట్టుబాటు వచ్చే పంటలు వేసేలా ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్వేతసౌథంలో తొలి కరోనా కేసు.... అగ్రరాజ్యం అప్రమత్తం