Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

82వ రోజుకి రాజధాని రైతుల ఆందోళన

82వ రోజుకి రాజధాని రైతుల ఆందోళన
, ఆదివారం, 8 మార్చి 2020 (11:57 IST)
రాజధాని ప్రాంత గ్రామాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు నేటితో 82వ రోజుకు చేరాయి. వెలగపూడిలో రైతుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.

పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, ఉండవల్లి రాయపూడి, నేలపాడు, పెదపరిమితాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలులో రైతులు ధర్నాలు చేస్తున్నారు.

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించొద్దని, రాజధాని కోసం నిరసనలు తెలపాలని అమరావతి ప్రాంత మహిళలు పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో మందడంలో వినూత్న పద్ధతిలో నిరసనలు తెలిపేందుకు మహిళలు సిద్ధమయ్యారు. మదర్ థెరిస్సా, రాణి రుద్రమదేశి, ఝాన్సీ లక్ష్మీభాయి, మలాల వేష ధారణలు ధరించి నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు.

అదేవిధంగా నల్ల బెలూన్లను ఎగురవేసి, రాట్నాలతో నూలు వడకాలని నిర్ణయించారు. మరోవైపు వెలగపూడిలో 22 మంది మహిళలు 24 గంటల పాటు దీక్ష చేయనున్నారు. 151 మంది మహిళలు 12 గంటల దీక్ష చేపట్టాలని నిర్ణయించారు.
 
అమరావతి పరిరక్షణ వేదిక పేరుతో సాగుతున్న ఉద్యమంలో మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రోజూ ఆందోళన కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. గతంలో ఎన్నడూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనని వారికి ఈ ఉద్యమ అనుభవం కొత్త పాఠాలు నేర్పుతోంది.

తుళ్లూరు మహిళలు తమ ప్రాంతంలో హైకోర్టు నిర్మాణం పూర్తి అయ్యి, కార్యకలాపాలు సాగిస్తున్నా, ఎప్పుడూ అటువైపు చూడలేదు. కనీసం ఉళ్లో పోలీసుస్టేషన్‌ లోపల ఎలా ఉంటుందో వారికి తెలియదు.

రెండు నెలల వ్యవధిలో అంతా మారిపోయింది. కేసులు, బెయిలు.. ఇలా ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. పోలీసు సెక్షన్లు కూడా తెలుసుకుంటున్నారు.
 
రాజధాని గ్రామాల మహిళలు రోజూ రోడ్డెక్కుతున్నారు. రాష్ట్ర భవిష్యత్‌కోసం వారు భూములను త్యాగం చేస్తే.. ఇప్పుడు ఆ త్యాగాల పునాదుల మీదే, వారి ఆశలను సమాధి చేస్తుండటంతో ధర్నాలు, దీక్షలతో పోరాడుతున్నారు.

ఒకరికిఒకరం అన్నట్టు 29 గ్రామాల మహిళలు ఒక్కటి అయ్యారు. రోజూ ఏం జరుగుతోందో చర్చించుకుంటున్నారు. ఐక్యత పెరిగింది. వయసు, కులం, మతం, ధనిక, పేద అనే తారతమ్యాలు చెరిగిపోయాయి. అందుకే వారి పోరాటం ముందుకు సాగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనాలో కరోనా: పోలీసులకు స్మార్ట్ హెల్మెట్లు.. శరీర ఉష్ణోగ్రతలను..?