తన భర్త, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసిన రాజమండ్రి సెంట్రల్ జైలులో బంధించడాన్ని ఆయన సతీమణి నారా భువనేశ్వరి జీర్ణించుకోలేక పోతున్నారు. ఏపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు నిరసనగా, తన భర్తకు సంఘీభావంగా ఆమె మంగళవారం నుంచి రెండు రోజుల పాటు నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. దీనికి రాజమండ్రి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
పైగా, ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు, భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలిపేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలను కూడా పోలీసులు అనుమతించబోమని నోటీసును కూడా జారీ చేశారు. పైగా, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు.
మరోవైపు, పోలీసుల తీరుపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగారంటూ వారు మండిపడుతున్నారు. నారా భువనేశ్వరికి తెలపడానికి రావద్దంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేయడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు టీడీపీ పోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
"జగన్ రెడ్డి కక్ష చూసారా! నారా భువనేశ్వరి గారిని కలిసి సంఘీభావం తెలిపేందుకు రాజమహేంద్రవరానికి ఎవరూ రావద్దంట. అలా ఆమెను కలిసేందుకు వెళ్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారంట. అలాగని పోలీసులు జారీ చేస్తున్న నోటీసులు ఇదిగో చూడండి" అంటూ పోలీసులు జారీ చేసిన నోటీసును సైతం వారు ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.