ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతోందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. జగన్ మాట ఇస్తే తప్పడనే పేరు సంపాదించుకున్నానని వివరించారు. "ఏపీ నీడ్స్ జగన్" కార్యక్రమాన్ని వచ్చే నెల 1 నుంచి డిసెంబర్ 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తామని సీఎం జగన్ వెల్లడించారు.
రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, ఏ ఒక్క కుటుంబం కూడా వ్యాధుల బారిన పడకూడదని జగనన్న సురక్ష పథకం తీసుకొచ్చామని తెలిపారు.
ఈ పథకం కింద 15 వేల హెల్త్ క్యాంపులను నిర్వహిస్తూ, 1.65 కోట్ల ఇళ్లను కవర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పార్టీ వైసీపీ తప్ప మరొకటి లేదని స్పష్టం చేశారు.
సామాజిక వర్గాలకు, ప్రాంతాలకు సమన్యాయం చేశామని సీఎం జగన్ తెలిపారు. మూడు ప్రాంతాల ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేలా మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా, ఓ బాధ్యతగా అధికారాన్ని చేపట్టామని జగన్ వివరించారు. ప్రజలకు తొలి సేవకుడిగా పాలన అందిస్తున్నాం. కాబట్టే ఈ 52 నెలల కాలం చరిత్రలో నిలిచేలా మారిందని వివరించారు.