ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సర్కారీ బడుల్లో తెలుగు తల్లి గీతాలాపన రద్దు చేసి వైకాపా పాటలు పెట్టేశారా అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. ఏపీ విద్యా మంత్రి పాల్గొన్న కార్యక్రమంలో తెలుగు తల్లి గీతాలాపన చేయకుండా రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న అంటూ విద్యార్థులతో అధికారులు ఆలపించారు. డ్యాన్సులు వేయించారు. దీనిపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ అంశంపై నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వైకాపా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేసారా? లేకపోతే ప్రభుత్వ గిరిజన గురుకుల పాఠశాలలో ఏంటీ సిగ్గుమాలిన పనులు? అమ్మఒడి ఇస్తున్నామని ప్రచారం చేసుకుని వైకాపా బడులు చేస్తున్నారా?
వైకాపా జెండా ఎత్తమంటూ ముక్కుపచ్చలారని పిల్లలతో ఆడించారు. రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న అంటూ విద్యార్థులతో పాడించారు. విద్యాశాఖా మంత్రి సాక్షిగా విద్యాలయాన్ని విషప్రచార నిలయం చేశారు.
మొన్న భామిని తహసీల్దార్ తాగి మన జగనన్న అంటూ గెంతులేశాడు. నిన్న వందలాది గిరిజన విద్యార్థులతో వైకాపా పార్టీ ప్రచారగీతాలకు స్టెప్పులేయించారు. ప్రభుత్వ కార్యక్రమాలలో తెలుగుతల్లి గీతాలాపన రద్దు చేసి వైకాపా పాటలు పెట్టేశారా? అంటూ తన ట్వీట్‌లో నిలదీశారు.