వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోమారు విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సూసైడ్ ప్రదేశ్‌గా మార్చాడంటూ విమర్శలు చేశారు.
ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, ఎన్నికలకు ముందు నవరత్నాలు ఇస్తానని చెప్పిన జగన్... అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మాట మార్చి జనాల నెత్తిన నవరత్న తైలం రాశారని విమర్శించారు.
ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా నిరూపించుకుంటానని చెప్పారని... కానీ, రాష్ట్రాన్ని ముంచేసిన సీఎంగా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. విధ్వంసంతో పాలనను ప్రారంభించిన వైసీపీ... ఆరు నెలలలో రాష్ట్రాన్ని సూసైడ్ ప్రదేశ్‌గా మార్చారంటూ మండిపడ్డారు.