ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న ఉన్న ఆదివారం రైల్వేకోడూరులో జరిగిన సభలో నిప్పులు చెరిగారు.
నవ్యాంధ్రలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2017లో కర్నూలు జిల్లాలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ కళాశాలలో ఓ అమ్మాయి మరణించిందని, ఆమెపై అఘాయిత్యం జరిగిందని ఆమె తల్లి చెబితే కళ్లవెంబడి నీళ్లు వచ్చాయని గుర్తుచశారు. ఆ ఆడబిడ్డను చంపిన వాళ్ల కేసును జగన్ రెడ్డి ఎందుకు బయటికి తీయడంలేదని నిలదీశారు. వాళ్లను ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
'పోలీసులు ఏంచేస్తున్నారక్కడ... వాళ్లకు లేరా ఆడబిడ్డలు, రాజకీయ నాయకులకు లేరా ఆడబిడ్డలు.. ఆ ఆడబిడ్డను చంపేసిన వెధవలకు లేరా ఆడబిడ్డలు... అడిగేవాళ్లు లేరా?" అంటూ తీవ్రస్వరంగా ప్రసంగించారు.
అంతేకాకుండా, జిల్లాలో బత్తాయి తోట నరికివేతను ప్రస్తావిస్తూ, పచ్చనిచెట్లను నరికేవాళ్లు, పద్నాలుగేళ్ల ఆడబిడ్డపై అత్యాచారం చేసినవాళ్లకు ఆ ఉసురు ఊరికేపోదని హెచ్చరించారు. నాశనం అయిపోతారని, రోజులు లెక్కబెట్టుకోండని తీవ్రస్వరంతో వ్యాఖ్యానించారు.