ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని టీడీపీకి చెందిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నాగలి పట్టి, ఏరువాక సేద్యాన్ని ప్రారంభించారు. ఆదివారం ఉదయం ఆరు గంటలకు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం, వీఎన్ పురంలోని తన వ్యవసాయక్షేత్రానికి చేరుకున్న ఎంపీ కలిశెట్టి.. ఎద్దులు, నాగలిని పూజించారు. ఆ తర్వాత ఎద్దులకు అరక కట్టి నాగలితో భూమిని దున్నారు.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంట్ సభ్యుడుగా తొలిసారి ఏరువాక నిర్వహించడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని రైతులు, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాక్షించారు. రైతు కుటుంబాల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు మంచి పథకాలు తీసుకొస్తున్నారని ఎంపీ కలిశెట్టి అప్పనాయుడు వ్యాఖ్యానించారు.