Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజధానిపై మంత్రుల పొంతనలేని ప్రకటనలు.. నాదెండ్ల మనోహర్‌

రాజధానిపై మంత్రుల పొంతనలేని ప్రకటనలు.. నాదెండ్ల మనోహర్‌
, మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (09:06 IST)
రాజధానిపై అవగాహన లేమితో మంత్రులు పొంతనలేని ప్రకటనలు చేస్తున్నారని జనసేన పార్టీ పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆక్షేపించారు. అన్ని రంగాలు కుదేలైపోయి, జనం అయోమయ స్థితిలో ఉన్న తరుణంలో ముఖ్యమంత్రి అనే వ్యక్తి మీకు నేనున్నాననే భరోసా ఇచ్చేలా ఉండాల్సిందిపోయి.. పట్టనట్లు వ్యవహరించటం బాధాకరమన్నారు.

గుంటూరు జిల్లా తెనాలిలోని జనసేన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. "రాష్ట్ర రాజధాని అమరావతే అనేది సుస్పష్టం. దానిని మార్చే నైతికత, అధికారం మీకు లేవు. ఇప్పటికే రూ. 8,400కోట్లు పెట్టుబడులు పెట్టిఉంటే, మరోచోటకు ఎట్లా మారుస్తారు? రోడ్లు, డ్రెయిన్లు, భవన నిర్మాణాలు జరిగాయి. వాటిలో ఏవైనా అవకతవకలుంటే కమిటీ వేసి వాటిని ధైర్యంగా ప్రజలముందు పెట్టాలి.

అంతేగాని.. పెట్టుబడి పెట్టేవారిపై కేసులు పెట్టటం ఎటువంటి సంస్కృతో మీరే చెప్పాలి. రైతులు ఏదో ఒక పార్టీకి భూములివ్వలేదు. రాజధాని కోసం స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇప్పుడు వారు తాము చేసిన త్యాగం మసిబారిపోతుందనే బాధతో ఉన్నారు. వారిని అక్కున చేర్చుకుని భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఎందుకు తీసుకోరు?

పోనీ పరిపాలన విషయంలో ఏమైనా సాధించారా అంటే అదీ లేదు. ఈ వంద రోజుల్లో మీరు సాధించిందేమీ కనిపించడం లేదు. మీకైనా ఏమైనా చేశామనిపిస్తోందా" అని నిలదీశారు.

"రాష్ట్ర ప్రజలు మీపై ఎన్నో ఆశలు పెట్టుకుని గెలిపిస్తే వారి సంక్షేమాన్ని పక్కనపెట్టి రాజధాని తరలింపుపై మీ మంత్రుల ప్రకటనల గందరగోళం ఏమిటి! మీరు స్పందించాల్సిన కీలక అంశంపై వారు మాట్లాడుతున్నారంటే అది మీ అసమర్థత అనుకోవాలా! లేక నిజంగానే వారి ప్రకటనల వెనుక మీ ప్రమేయం కూడా ఉందా?

అసలు రాజధాని విషయంలో మీ మౌనం వెనుక ఆంతర్యం ఏమిటి? దీనిపై మీరు ఎందుకు స్పందించటంలేదో వెంటనే ప్రజలకు విరవణ ఇవ్వాలి" అని ప్రశ్నించారు. రాజధాని రైతులకు, రాష్ట్ర ప్రజలకు జనసైనికులు అండగా నిలవాలని పిలుపిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్తగా జస్టిస్‌ పి.లక్ష్మణరెడ్డి