Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజధాని మార్పు వార్తలపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు

రాజధాని మార్పు వార్తలపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు
, బుధవారం, 28 ఆగస్టు 2019 (19:34 IST)
రాజధాని అమరావతిపై గత వారం రోజులుగా జరుగుతున్న రగడ అందరికీ తెలిసిందే. ఇక ఇప్పటికీ రాజధాని అమరావతి విషయంలో ఎవరికి తోచిన అభిప్రాయం వారు చెబుతున్నారు.

రాజధాని అంశం రణరంగంగా మారుతున్నా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో రాజధాని మార్చే ఆలోచన జగన్‌కు లేదు అంటూ కొందరు నేతలు, త్వరలో రాజధానిపై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటిస్తామని మరికొందరు వైసీపీ నేతలు చెప్పడం ఏపీలో గందరగోళానికి గురి చేస్తుంది. 
 
తాజాగా రాజధాని అమరావతిని మారుస్తారంటూ రాజకీయాలు వేడెక్కిన నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖలో పర్యటించిన లక్ష్మీపార్వతి కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
 
రాజధానిని అమరావతి నుండి దొనకొండకు మారుస్తున్నట్లుగా వస్తున్న వార్తలపై స్పందించిన లక్ష్మీపార్వతి జగన్ ఎప్పుడు రాజధానిని మారుస్తున్నట్లు చెప్పలేదంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఇక అంతలోనే ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాజధాని వికేంద్రీకరణ అవసరమని వ్యాఖ్యానించారు.
 
రాజధాని వికేంద్రీకరణ వల్ల అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందన్న లక్ష్మీ పార్వతి, రాజధాని ఒక ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందుతుందని, మిగతా ప్రాంతాల అభివృద్ధికి దూరంగా ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇక అభివృద్ధి ఒక ప్రాంతానికే పరిమితం అయితే భవిష్యత్తులో ప్రాంతాల మధ్య విభేదాలు పెరుగుతాయని, ప్రాంతీయ ఘర్షణలు ఎక్కువవుతాయని అభిప్రాయపడ్డారు. రాజధాని అమరావతి విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆచితూచి నిర్ణయం తీసుకుంటారని చెప్పిన లక్ష్మిపార్వతి అన్ని ప్రాంతాల వారు జగన్‌కు ఓటు వేశారని ఆ విషయాన్ని గ్రహించి జగన్ తన పాలన సాగిస్తున్నారని చెప్పారు.
 
రాజధాని మార్పుపై జగన్ ఏం చెప్పలేదు అంటూనే రైతుల దృష్టి మరల్చేందుకే రాజధానిని మార్పు చేస్తున్నారని టీడీపీ ప్రచారం చేస్తుందని లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. ఇక చంద్రబాబు కావాలనే రాజధాని అంశాన్ని తెరమీదకు తీసుకు వచ్చి నానా రచ్చ చేస్తున్నారని మండిపడ్డారు.

ఇక జగన్ ఇప్పటివరకు రాజధానిని మారుస్తానని చెప్పలేదని, ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ తరహా వ్యాఖ్యలే రాజధాని ప్రజల్లోనూ, ప్రతిపక్ష పార్టీలలోనూ గందరగోళానికి కారణమవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభుత్వ వైఫల్యాలపై వినూత్న నిరసనలు... మాజీ మంత్రి దేవినేని ఉమా