Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్తగా జస్టిస్‌ పి.లక్ష్మణరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్తగా జస్టిస్‌ పి.లక్ష్మణరెడ్డి
, మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (08:57 IST)
ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్తగా ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ పి.లక్ష్మణరెడ్డి నియమితులయ్యారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లోకాయుక్త చట్ట సవరణ మేరకు హైకోర్టు రిటైర్డ్‌ ప్రధాన న్యాయమూర్తినిగానీ, న్యాయమూర్తినిగానీ లోకాయుక్తగా నియమించవచ్చు.

ఆ మేరకు జస్టిస్‌ పి.లక్ష్మణరెడ్డి నియామకంపై ఇటీవల హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ ఆమోదం పొందిన ప్రభుత్వం.. దీనిపై సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. లోకాయుక్తగా ఆయన ఐదేళ్లపాటు కొనసాగుతారు.

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మంత్రి, అసెంబ్లీ కార్యదర్శి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చీఫ్‌ విప్‌, జడ్‌పీపీ, ఎంపీపీ చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్లు, సభ్యులు, మేయర్‌, డిప్యూటీ మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్‌, సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులపై వచ్చే ఫిర్యాదులను లోకాయుక్త విచారణ చేపట్టవచ్చు.

అదేవిధంగా ప్రజా వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వం నియమించిన అధికారులనూ విచారించవచ్చు. అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలకు సంబంధించి ఎవరైనా లోకాయుక్తలో ఫిర్యాదు చేయవచ్చు.
 
జస్టిస్‌ పి.లక్ష్మణరెడ్డి 1945 ఏప్రిల్‌ 18వ తేదీన వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. కడప జిల్లా, సింహాద్రిపురం మండలం, పైడిపాలెం గ్రామం ఆయన స్వస్థలం. పైడిపాలెం, కొండాపురం, సింహాద్రిపురంలలో ప్రాథమిక, మాధ్యమిక విద్యాభ్యాసం ముగిసింది.

కడపలో బీఎస్సీ పూర్తి చేసిన ఆయన.. బెంగుళూరులోని బీఎంఎస్‌ కాలేజీలో లా పట్టభద్రుడయ్యారు. 1972 డిసెంబరులో న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టిన జస్టిస్‌ లక్ష్మణరెడ్డి.. కడప జిల్లా కోర్టులో ప్రముఖ క్రిమినల్‌ లాయర్‌గా పేరొందిన యు.రామిరెడ్డి వద్ద ప్రాక్టీసు మొదలుపెట్టారు.

అనంతరం 1976లో మున్సి్‌ఫగా నియమితులైన ఆయన.. తాడేపల్లిగూడెం, ధర్మవరం, తాడిపత్రిలలో బాధ్యతలు నిర్వర్తించారు. అసిస్టెంట్‌ సెషన్స్‌ జడ్జిగా మదనపల్లె, గుత్తి, అనంతపురంలలో పని చేశారు. 2005 మే 26న ఏపీ హైకోర్టు అదనపు జడ్జిగా పదోన్నతి పొంది, 2006 ఫిబ్రవరి 20వ తేదీన శాశ్వత జడ్జిగా నియమితులయ్యారు. 2007 ఏప్రిల్‌ 18వ తేదీన హైకోర్టు న్యాయమూర్తిగా రిటైర్‌ అయ్యారు.

తర్వాత... అంటే, 2007 ఏప్రిల్‌ నుంచి 2010 ఏప్రిల్‌ వరకూ సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌(క్యాట్‌) హైదరాబాద్‌ బెంచ్‌ వైస్‌చైర్మన్‌గా విధులు నిర్వహించారు. అనంతరం ఆయన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం తదితర విషయాల్లో తలెత్తిన వివాదాలపై జనచైతన్యవేదిక తరఫున ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ప్రయత్నించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్విస్ బ్యాంకు డేటా వస్తోంది