Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు నాటక రంగానికి పితామహుడు కందుకూరి

తెలుగు నాటక రంగానికి పితామహుడు కందుకూరి
, గురువారం, 16 ఏప్రియల్ 2020 (18:02 IST)
సాంఘిక దురాచారాలను సంభాషణాత్మకంగా, వినోదాత్మకంగా విమర్శిస్తూ సమాజ సంస్కరణకు దోహదపడే తెలుగు సాహిత్యం, నవలలు, నాటకాలను తనదైన శైలిలో రచించిన గొప్ప సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు అని రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ టి.విజయకుమార్ రెడ్డి  కొనియాడారు.

తొలి తెలుగు నాటక రచయితగా ఘనతకెక్కిన కందుకూరి వీరేశలింగం పంతులు తెలుగు నాటక రంగానికి పితామహుడు అయ్యారన్నారు. కందుకూరి వీరేశలింగ పంతులు 173 వ జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గురువారం విజయవాడలోని ఎఫ్.డి.సి. కార్యాలయంలో కందుకూరి చిత్రపటానికి ఆయన పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
 
ఈ సందర్బంగా ఎఫ్.డి.సి. మేనేజింగ్ డైరెక్టర్  టి.విజయకుమార్ మాట్లాడుతూ.. తొలి తెలుగు నాటక రచయితగా ఘనతకెక్కిన వీరేశలింగం పంతులు జన్మదినమైన  ఏప్రిల్ 16 న తెలుగు నాటక రంగ దినోత్సవంగా ప్రభుత్వం ప్రతి ఏడాది జరుపుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయం అన్నారు. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త అయిన కందుకూరి వీరేశలింగం పంతులు తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. 
 
ఆంధ్ర సమాజాన్ని సంస్కరణల బాట పట్టించిన సంస్కర్త వీరేశలింగం అని, ఆయన చేసిన ఇతర సంస్కరణా కార్యక్రమాలొక ఎత్తు అయితే, వితంతు పునర్వివాహాలు మరొక ఎత్తు అన్నారు. అప్పటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవారని, కాపురాలకు పోకముందే భర్తలు చనిపోయి, వితంతువులై, అనేక కష్టనష్టాలు ఎదుర్కొనేవారన్నారు.

దీనిని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాలకు నడుంబిగించిన మహాన్నత వ్యక్తి వీరేశలింగం పంతులు అని టి.విజయకుమార్ రెడ్డి కొనియాడారు. స్త్రీలకు విద్య నేర్పించక పోవటమే దురాచారాలకు కారణమని భావించి ధవళేశ్వరంలో 1874లో బాలికల కోసం ప్రత్యేకంగా ఒక విద్యాలయాన్ని ప్రారంభించిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు.

సమాజం నుండి ఎన్నో అడ్డంకులు, విమర్శలు వచ్చినప్పటికీ వాటన్నింటినీ ఓర్పుగా, ధైర్యంగా ఎదుర్కోవటమే కాకుండా, తన రచనలు, ఉపన్యాసాలు ద్వారా ప్రజలను ఒప్పించి మెప్పించగలిగారన్నారు. వ్యావహారిక భాషా ఉద్యమానికి వీరు చేసిన కృషి మరువరానిది అని అన్నారు. వ్యవహార ధర్మబోధిని తొలి తెలుగు రూపక ప్రదర్శన జరిగిన నాటకం అని, ఇది నాటక రంగంలో వారి తొలిప్రస్తానం అన్నారు.

అటువంటి  గొప్ప సంఘ సంస్కర్తను మనం నేడు స్మరించుకొనే గొప్ప అదృష్టమని టి.విజయకుమార్ అన్నారు. ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగం పంతులుకు అనేక విశిష్టతలు ఉన్నాయని రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ది  చైర్మన్ టి.ఎస్.విజయ్ చందర్ పేర్కొన్నారు.

అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు అని ప్రశంశించారు.  ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన కందుకూరి తొలి వితంతు వివాహం జరిపించిన వ్యక్తని, మొట్టమొదటి సారిగా సహవిద్యా పాఠశాలను ప్రారంభించారని, తెలుగులో మొదటి స్వీయ చరిత్ర, తొలి నవల, తొలి ప్రహసనం రాసింది  ఆయనేనని కొనియాడారు. 

తాను నమ్మిన సత్యాన్ని, సిద్దాంతాన్ని తు.చ. తప్పకుండా పాటించిన వ్యక్తి ఆయన అన్నారు. యుగకర్త గా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉందన్నారు.  తెలుగు జాతి నిత్యం స్మరించుకునే మహోన్నత వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు అని  విజయ్ చందర్ అభివర్ణించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోండి: విజయవాడ సీపీకి ముస్లిం పెద్దల విజ్ఞప్తి.. విచారణకు ఆదేశం