కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయం కారణంగా శ్రీవారి ఆలయంలో మే 3వ తేదీ వరకు భక్తులకు దర్శనం నిలుపుదల చేసిన విషయం తెలిసిందే.
అదేవిధంగా, ఆలయంలో అన్నిరకాల ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది. ఈ నేపథ్యంలో మార్చి 13 నుండి మే 31వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారాగానీ, పోస్టాఫీసుల ద్వారా గానీ శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఆ మొత్తాన్ని రీఫండ్ చేసేందుకు టిటిడి చర్యలు చేపట్టింది.
ఈ మేరకు ఆర్జిత సేవలను గానీ, దర్శన టికెట్లను గానీ బుక్ చేసుకున్న భక్తులు సంబంధిత టికెట్ వివరాలతోపాటు, బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్‌సి కోడ్ వివరాలను
[email protected] మెయిల్ ఐడికి పంపాలని టిటిడి కోరుతోంది.
ఐటి విభాగం ఆధ్వర్యంలో ఈ వివరాల ఖచ్చితత్వాన్ని పరిశీలించిన అనంతరం రీఫండ్ మొత్తాన్ని నేరుగా భక్తుల ఖాతాల్లోకి జమ చేస్తారు.