లాక్‌డౌన్ వేళ తెలంగాణ, భద్రాద్రి జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. డబ్బు పిచ్చి తలకెక్కిన ఓ వడ్డీ వ్యాపారి దాష్టీకం ప్రదర్శించాడు. తీసుకున్న అప్పు సకాలంలో తీర్చలేదన్న కోపంతో ఆ కుటుంబంపై కక్షసాధింపుకు పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళితే…భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలోని సులానగర్‌కు చెందిన అజ్మీరా హట్యా అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన బానోత్ హన్మా అనే వడ్డీ వ్యాపారి వద్ద గతంలో రూ. 2లక్షలు అప్పుగా తీసుకున్నాడు.
అందులో లక్షన్నర వరకు తిరిగి చెల్లించేశాడు. కాగా, మరో రూ. 50వేలు మాత్రం చెల్లించాల్సి ఉంది. ఇంతలోనే కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా మిగిలిన అసలు, వడ్డీ చెల్లించేదుకు వడ్డీ వ్యాపారిని గడువు కోరాడు అజ్మీరా.
అందుకు అంగీకరించని వడ్డీ వ్యాపారి అప్పు మొత్తం తీర్చేయాలని పట్టుబట్టాడు. ఈ క్రమంలో బాధితుడిపై దాడికి పాల్పడ్డాడు.
అడ్డుపడిన అతడి భార్యను తనతో పాటే ఇంటికి లాక్కెళ్లి నిర్భందించినట్లుగా బాధితుడు అజ్మీరా పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు టేకులపల్లి పోలీసులు హన్మాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.