ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భార్య రాజధాని కూతవేట దూరంలో భూములు ఎలా కొనుగోలు చేశారని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు.
అది ఇన్‌సైడర్ ట్రేడింగ్ కిందకు రాదా ? అని ఆయన వ్యాఖ్యానించారు. భూములు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినట్టే అని వైసీపీ ఆరోపించడాన్ని ఆయన తప్పుబట్టారు. వైసీపీ నేతలు సత్యహరిశ్చంద్రుల్లా మాట్లాడుతున్నారని ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు.
ఏపీ సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇదే రకమైన ఆరోపణలు చేస్తున్నారని... ఇప్పుడు అధికారం వచ్చిన తరువాత దీనిపై విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మేం తప్పు చేసినట్టు భావిస్తే విచారణ చేయాలని... దాన్ని సాకుగా చూపి రైతులను బలిపశువులను చేయొద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రభుత్వం భావిస్తే... అందులో తొలి ముద్దాయి సీఎం జగన్ అవుతారని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. తాడేపల్లి పరిధిలో సీఎం జగన్ బినామీలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని అన్నారు.