Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజధానిపై ఎందుకు గందరగోళం?.. రైతుల ప్రశ్న

రాజధానిపై ఎందుకు గందరగోళం?.. రైతుల ప్రశ్న
, శనివారం, 28 డిశెంబరు 2019 (21:35 IST)
మూడు రాజధానుల ప్రతిపాదన నుంచి ముఖ్యమంత్రి జగన్ వెనక్కు తగ్గే వరకూ ఆందోళనలు విరమించేది లేదని... అమరావతి ప్రజానీకం తేల్చి చెబుతోంది. బోస్టన్ కమిటి, హైపవర్ కమిటి అంటూ... ఎందుకు గందరగోళానికి గురిచేస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు.

రాజధాని నిర్మాణానికి నిధులు తీసుకురావటం చేతకాకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ... 11వ రోజున కూడా రైతులు, రైతుకూలీలు ఆందోళనలు నిర్వహించారు. తుళ్లూరు, మందడంలో మహాధర్నా, వెలగపూడిలో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. మంగళరిగి, తాడికొండలోనూ రాజధానికి మద్దతుగా ధర్నాలు నిర్వహించారు.

రాజధానిలోని 29 గ్రామాల ప్రజలు తమకు సమీపంలో ఉన్న ప్రాంతానికి వెళ్లి ఆందోళనల్లో పాల్గొన్నారు. పెద్దసంఖ్యలో రైతులు, రైతు కూలీలు, మహిళలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొని ముఖ్యమంత్రి జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్​ను నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు తమకు ఈ గతి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. కమిటీలు ఎందుకు వేస్తున్నారు..? విపక్ష నేతగా జగన్ అమరావతికి అంగీకరించారని... అందుకే తాము భూసమీకరణకు ముందుకొచ్చి త్యాగం చేశామని రైతులు తెలిపారు.

ఎన్నో ఆశలతో భూములిచ్చిన తమకు నిరాశ, నిర్వేదం మిగిలిందని వాపోయారు. జీఎన్ రావు కమిటి అంటూ పది రోజులుగా ఆందోళనకు గురిచేసి... ఇపుడు మళ్లీ బీసీజీ కమిటి నివేదిక అంటూ ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. శివరామకృష్ణన్ కమిటీ, నారాయణ కమిటీల నివేదికల మేరకు రాజధాని నిర్ణయం జరిగిందని... అసెంబ్లీ తీర్మాణం తర్వాత అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. కేంద్రప్రభుత్వం కూడా ఈ ప్రాంతాన్ని రాజధానిగా గుర్తించిందని వివరిస్తున్నారు.

సగం రాజధాని పూర్తయిన తర్వాత ఇపుడు కమిటీలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. బోస్టన్ కమిటీపై నేతల ఆరోపణలు... రైతుల ఆందోళనకు భాజపా, తెదేపా నాయకులు మద్దతు పలికారు. బోస్టన్ కమిటీపై అనేక ఆరోపణలు ఉన్నాయని... వాళ్లిచ్చే నివేదిక ఎలా ప్రామాణికమని దేవినేని ఉమ ప్రశ్నించారు. బోస్టన్ కమిటీతో వైకాపా నేత విజయసాయిరెడ్డికి సంబంధాలున్నాయని ఆరోపించారు. జనవరి 18వ తేదిన రాజధాని మార్పుపై అసెంబ్లీలో ప్రకటన చేసేందుకు ముఖ్యమంత్రి ప్లాన్ వేశారని... రైతులు ఏమాత్రం వెనక్కు తగ్గినా నష్టపోతారని హెచ్చరించారు.

రాజధాని ప్రజలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రాయలసీమకు హైకోర్టు ద్వారా పెద్దగా ఉపయోగం లేదని... జగన్​కు చేతనైతే నికర జలాలు కేటాయించి అక్కడి భూములకు నీళ్లివ్వాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనలతో రాజధాని గ్రామాల్లో పోలీసుల పహారా కొనసాగుతోంది. రాజధాని ప్రాంతానికి వచ్చేవారందరినీ పోలీసులు ఆపి వివరాలు తెలుసుకున్న తర్వాతే పంపిస్తున్నారు. ఆందోళన కార్యక్రమాలు రేపు కూడా కొనసాగనున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇకపై అభివృద్ధిపైనే ప్రభుత్వ ప్రధాన దృష్టి: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి