Publish Date: Wed, 11 Mar 2020 (05:27 IST)
Updated Date: Wed, 11 Mar 2020 (05:30 IST)
సీఎం జగన్ రాజ్యసభ సభ్యుల విషయంలో రాజద్రోహానికి పాల్పడ్డాడంటూ సీపీఐ అగ్రనేత నారాయణ అన్నారు. గతంలో వైఎస్ మరణానికి రిలయన్సే కారణమని జగన్ ఆరోపించాడని, ఇప్పుడు రిలయన్స్ కు చెందినవాళ్లకు రాజ్యసభ టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
ఇది జగన్ తన తండ్రికి చేసిన ద్రోహమేనని నారాయణ అభిప్రాయపడ్డారు. అటు కేసీఆర్ కుయుక్తులు పన్ని ఎన్నికల్లో గెలుస్తున్నాడని, ఇటు జగన్ ప్రత్యర్థులు పోటీచేయకుండా అడ్డుకుంటున్నాడని ఆరోపించారు.
వైఎస్ ఆత్మకు ద్రోహం: తులసిరెడ్డి
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తన స్వార్థం కోసం ఎవరితోనైనా కుమ్మక్కవుతారని, ప్రమాదంలో రాజశేఖర్‌రెడ్డి చనిపోయినప్పుడు అంబానీ సోదరులే కుట్రపన్నారని ఆరోపణలు చేసి, అదే రిలయన్స్ అధినేతకి నాలుగు రోజుల క్రితం రెడ్ కార్పెట్ వెల్‌కమ్ చెప్పారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్.తులసిరెడ్డి కడపలో అన్నారు.
తండ్రి ఆత్మకు కూడా ప్రశాంతత లేకుండా చేసి, ద్రోహం చేసిన వ్యక్తి రాష్ట్రానికి ఏవిధంగా మేలు చేస్తారో ప్రజానీకం ఆలోచించాలన్నారు.