Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

30 నాటికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌: జగన్‌

30 నాటికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌: జగన్‌
, మంగళవారం, 10 మార్చి 2020 (08:08 IST)
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపునకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ఉన్నత విద్యపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడారు. మార్చి 30 నాటికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఫీజులు చెల్లిస్తామన్నారు.

ఎప్పటికప్పుడు చెల్లింపులు జరిగితే కాలేజీలకు మంచి జరుగుతుందన్నారు. ప్రమాణాలు పాటించని కాలేజీలపై కఠిన చర్యలు ఉండాల్సిందేనన్నారు. ఉన్నత విద్యా వ్యవస్థలో నాణ్యతకు పెద్దపీట వేయాలన్నారు.
 
రాష్ట్రంలో పేద విద్యార్థులందరికీ మంచి చదువు అందాలని.. అప్పుడే వారు పరిపూర్ణ పరిజ్ఞానం, నైపుణ్యాలతో పోటీ ప్రపంచంలో నెగ్గుకొని రాగలుగుతారని సీఎం అన్నారు. ఉన్నత చదువులతోనే వారి భవిష్యత్‌ బంగారు మయం అవుతుందని చెప్పారు.

ఇలాంటి మంచి చదువులను అందరికీ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని వివరించారు. ఇందులో భాగంగానే ప్రతి మూడు నెలలకోసారి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయనున్నామని చెప్పారు.

తద్వారా కాలేజీల్లోని సిబ్బంది జీతభత్యాల చెల్లింపునకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఆయా సంస్థలకు వీలు కలుగుతుందని, బోధనాభ్యసన కార్యకలాపాలూ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగించగలుగుతాయని అభిలషించారు. ఇందుకోసం రాష్ట్రంలో సస్టెయినబుల్‌ (స్థిరమైన) ఫీజుల విధానం ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
 
ప్రతి ఒక్క కాలేజీ నిబంధనలను పాటిస్తూ ఉన్నత ప్రమాణాలను నెలకొల్పేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. నాణ్యతలో రాజీపడొద్దని, ప్రమాణాలు పాటించని కాలేజీలపై కఠిన చర్యలు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఉన్నత విద్యా వ్యవస్థలో నాణ్యతకు పెద్దపీట వేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య, ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం..29వరకు మద్యం షాపుల బంద్