Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఊరు ఊరికో జమ్మి చెట్టు... గుడిగుడికో జమ్మి చెట్టు!

ఊరు ఊరికో జమ్మి చెట్టు... గుడిగుడికో జమ్మి చెట్టు!
విజయవాడ , గురువారం, 16 సెప్టెంబరు 2021 (15:08 IST)
దసరా పండగ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో వినూత్న కార్యక్రమం నిర్వహించనుంది. తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో నెలకొల్పాలని సంక‌ల్పించింది. దసరా పండగ సందర్భంగా ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి చేతుల మీదుగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆవిష్కరించారు. 
 
వేద కాలం నుంచి అత్యంత ప్రతిష్ట కలిగిన చెట్టుగా, భక్తి పూర్వకంగా అందరూ పూజించుకునే జమ్మి చెట్లును తెలంగాణ రాష్ట్ర వృక్షంగా ప్రభుత్వం గుర్తించింది. అయితే అనేక కారణాలతో అంతరించిపోతున్న జమ్మి చెట్లను దాని విశిష్టత రీత్యా ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో ఉండేలా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున ఊరు ఊరుకో జమ్మి చెట్టు- గుడిగుడికో జమ్మి చెట్టు నినాదాన్ని సంతోష్ కుమార్ తీసుకున్నారు.
 
తెలంగాణలో దసరా నాడు జమ్మి చెట్టును పూజించడం ఆచారం. జమ్మి ఆకులను బంధుమిత్రులకు ఇచ్చిపుచ్చుకుని అందరికీ మంచి జరగాలని కోరుకోవటం కూడా ఆనవాయితీ. ఈ ప్రాధాన్యతల దృష్ట్యా రానున్న దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఊరుఊరుకో జమ్మిచెట్టు- గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమం మొదలవుతుందని బేగంపేటలో జరిగిన పోస్టర్ రిలీజ్ సందర్భంగా ఎం.పీ ప్రకటించారు. ఇప్పటికే ఇరవై వేలకు పైగా జమ్మి మొక్కలను సిద్దం చేస్తున్నామని, అన్ని గ్రామాలు, గుడులకు వీటిని పంపిణీ చేస్తామన్నారు.
 
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున చేపట్టిన ప్రతీ కార్యక్రమంలాగానే దీనిని కూడా విస్తృతంగా ప్రాచారం చేయటంతో పాటు, ప్రతీ ఊరిలో-ప్రతీ గుడిలో జమ్మి వృక్షం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుత తరానికి జమ్మి చెట్లు అంటే కేవలం దసరా రోజు మాత్రమే గుర్తుకు వస్తుందని, పురాణ కాలం నుంచి మన చరిత్రలో జమ్మికి ప్రాధాన్యత ఉందన్నారు. 
 
ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కాగానే, రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టును ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. వేదకాలం నుంచీ నిత్య జీవితంలో భాగమైన జమ్మిని ఊరిలో గుడిలో బడిలో భాగస్వామ్యం చేయాలన్న గొప్ప ఆలోచన చేసిన ఎం.పీ సంతోష్ కుమార్ కు అభినందనలు తెలిపారు. తమవంతుగా ప్రతీ ప్రాంతంలో జమ్మి మొక్క నాటేలా, రక్షించి పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైనార్టీలకు సబ్ ప్లాన్‌ ఏర్పాటుకు ఏపీ కేబినెట్‌ ఆమోద ముద్ర