నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్దిలో మరో ముందడుగు పడింది. ఇందులో భాగంగా, అమరావతి శుక్రవారం ఏకంగా 15 బ్యాంకులు, ఆర్థిక సంస్థల కార్యాలయాల ఏర్పాటుకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేయనున్నారు. తద్వారా రాజధానికి రూ.1328 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. అలాగే, 6500కి పైగా ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగ కల్పన లభించనుంది. అంతేకాకుండా, అమరావతిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేయనుంది.
రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్న 15 జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల రాష్ట్ర కార్యాలయాల భవన నిర్మాణ పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం 11.22 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొంటారు.
ఈ సంస్థల ఏర్పాటు ద్వారా అమరావతికి రూ.1,328 కోట్ల పెట్టుబడులు రానుండగా, సుమారు 6,514 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఏపీసీఆర్డీఏ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి, రాయపూడి, లింగాయపాలెం గ్రామాల్లో ఈ కార్యాలయాలను నిర్మించనున్నారు.
అమరావతిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు ప్రక్రియను సీఆర్డీఏ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కార్యాలయాలు, ఉద్యోగుల నివాసాల కోసం మొత్తం 27.85 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఎస్బీఐ, కెనరా, నాబార్డ్, యూనియన్ బ్యాంకు వంటి ప్రముఖ సంస్థలు ఇక్కడ తమ కార్యాలయాలను నిర్మించుకోనున్నాయి.
రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగిన ఈ విందుకు మంత్రి లోకేశ్‌తో పాటు నారా భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా హాజరయ్యారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం, పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులపై నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించనున్నారు.