ఛలో ఆత్మకూరు అంటూ చంద్రబాబునాయుడు ఈ నెల 11న ఇచ్చిన పిలుపు నేపధ్యంతో గుంటూరులోని ఓ హోటల్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు, ఎంఎల్ ఏలు మంత్రి మోపిదేవి అధ్యక్షతన సమావేశమయ్యారు.
సమావేశానికి పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు, నందిగమ్ సురేష్ , శాసనసభ్యులు అంబటి రాంబాబు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, ముస్తఫా, కిలారి రోశయ్య, అన్నాబత్తుని శివకుమార్, మెరుగు నాగార్జున, పార్టీ గుంటూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్ గాంధి, పార్టీ పశ్చిమనియోజకవర్గ ఇన్ ఛార్జ్ చంద్రగిరి ఏసురత్నం, పార్టీ సీనియర్ నేతలు మర్రిరాజశేఖర్, టిజివి కృష్ణారెడ్డి, కావటి మనోహర్ నాయుడు, గుత్తికొండ అంజిరెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో వైయస్సార్ కాంగ్రెస్ బాధితులు, శిబిరం అంటూ చంద్రబాబు చేస్తున్న దుష్ర్పచారం, వాస్తవానికి గత ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ చేతిలో దారుణంగా వేధింపులకు గురైన పలువురు బాధితులు పల్నాడు ప్రాంతంలోను ముఖ్యంగా మాచర్ల, గురజాల, వినుకొండ, నరసరావుపేట, సత్తెనపల్లి తదితర ప్రాంతాలలో ఉన్న విషయం చర్చకు వచ్చింది. ఈ నేపధ్యంలో సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను మీడియాకు వివరించారు.
మీడియా సమావేశంలో రాష్ర్ట పశుసంవర్ధకశాఖమంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన 100 రోజుల్లో రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. జగన్ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. నిరుద్యోగులకు 4 లక్షల మందికి ఉద్యోగాలను కల్పిస్తున్నారు.
వరణుడు కరుణించి నదులు జలకళతో ఉట్టిపడుతూ రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. చంద్రబాబు తన మనుగడను కాపాడుకునేందుకు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. వరద రాజకీయాలకు భిన్నంగా ప్రభుత్వం సమైఖ్యతాభావంతో భాధిత ప్రజలను ఆదుకుంది. శాంతి భధ్రతలకు విఘాతం కలుగుతుందని, హత్యారాజకీయాలు జరుగుతున్నాయంటూ బాబు మళ్ళీ కొత్త కథను తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి జగన్ ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు జగన్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మేమంతా నడుస్తున్నాం. సంబంధం లేని కామెంట్స్ చేస్తూ తెదేపా ముందుకు నడుస్తుందని, హత్యా రాజకీయాలను ప్రోత్సహించిన పార్టీ ఒక్క టిడిపినే అని ఆరోపించారు.
వినుకొండలో వైసీపీ మద్దతుదారులు అప్పట్లోటిడిపి నాయకుల వేధింపులకు ఊర్లు వదిలి వెళ్ళాపోయారని, హత్యా రాజకీయాలకు తెరలేపి గ్రామాలకు గ్రామాలను ఖాళీచేయించిన ఘనత టిడిపికే దక్కుతుందన్నారు. తెదేపా 5 ఏళ్ళ పాలనలో అవినీతి, అక్రమాలు, హత్యారాజకీయాలు జరిగాయి.
స్పీకర్ గా అత్యున్నత పదవిలో ఉండి కోడెల కుటుంబం, మైనింగ్ డాన్ యరపతినేని శ్రీనివాసరావు చేసిన అరాచకాలు అన్ని ఇన్నీ కావని అవినీతి, అక్రమాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే పునరావాస కేంద్రాల డ్రామాలకు తెర లేపారని ఆరోపించారు. మంచిని చెడుగా..చెడుని మంచిగా మల్చుకునే రాజకీయ జిత్తుల మారి చంద్రబాబు అని విమర్శించారు.
తెదేపా పాత పద్దతిలోనే కొనసాగాలనుకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.క్కడ తన ఉనికిని కోల్పోతానో అన్న భయంలో చంద్రబాబుతో సహా టీడీపీ నేతలంతా ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక వరద రాజకీయాలకు తెరలేపారని, అవి ఫెయిల్ అయిన తరువాత హత్యా రాజకీయాలను ముందుకు తెస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో రాజకీయ హత్యలు, కక్ష సాధింపు చర్యలు ఉండేవని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వ అధికారులపై చేయి చేసుకున్న ఘనత టీడీపీ నాయకులదని అన్నారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయని మంత్రి తెలియజేశారు. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు చెందిన అక్రమ మైనింగ్పై కోర్టు ప్రశ్నిస్తే బాధ్యత ప్రభుత్వానికి ఎలా అవుతుందని ప్రశ్నించారు.
కోడెల కుటుంబం చేసిన అక్రమాల వల్ల బలైన బాధితులు కోర్టులను, పోలీసులను ఆశ్రయిస్తే దానికి తమని నిందించడం సరికాదన్నారు. అనినీతి లేకుండా సంక్షేమం దిశగా తమ ప్రభుత్వం ముందడుగు వేస్తోందని, కావాలని తమపై నిందలు వేస్తే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు.
సత్తెనపల్లి ఎంఎల్ ఏ అంబటిరాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు గత కొంతకాలంగా రాష్ట్రంలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. పల్నాడులోటిడిపి నాయకుల పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దాడులు చేస్తుందని ఆరోపణలు చేస్తున్నారు.
వైయస్ జగన్ సీఎం అయ్యాక పల్నాడులో మరింత ప్రశాంతత చేకూరింది.ఐదేళ్ళ టిడిపి పాలనలో పల్నాడులో ఫ్యాక్షనిజాన్ని అభివృద్ధి చేశారని....వాళ్ళే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను వేధింపులకు గురిచేసి తిరిగి అన్యాయంగా వైయస్సార్ కాంగ్రస్ పార్టీ నేతలపైనే కేసులు పెట్టారని అన్నారు.
యరపతినేని, కోడెల, పుల్లారావు, జీవీ ఆంజనేయులు చాలా అరాచకాలు చేశారని అన్నారు. ఓడిన చంద్రబాబు ఛలో ఆత్మకూరు కు శ్రీకారం చుట్టి గుండాల్లా వ్యవహరిస్తున్నారు. మాచర్ల, దుర్గి, నరసరావుపేట ప్రాంతాల్లో గత ఐదేళ్లలో ఉన్న టిడిపి భాధితులతో కలిసి తామూ ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని చేపడుతున్నామని బాధితులకు సమాధానం చెప్పేందుకు బాబు సిద్దంగా ఉండాలని చెప్పారు.
సెప్టెంబర్ 11,ఉదయం 9గంటలకు గుంటూరు నగరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నుండి ఆత్మకూరుకు బయల్దేరతామని అన్నారు. నిజమైన బాధితులు లేకపోవడంతో పెయిడ్ ఆర్టిస్ట్ల్ లతోచంద్రబాబు రాజకీయం చేస్తున్నారని, చంద్రబాబు చేస్తున్న అన్యాయం, అక్రమాలను ప్రజలకు చెప్పేందుకు తాము ఆత్మకూరుకు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు.
పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ గడిచిన పదేళ్ళల్లో నాగార్జున సాగర్ కుడికాల్వకు నీళ్ళు రాక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తమ ప్రభుత్వ హయాంలో నీళ్ళు వచ్చి రైతులంతా సంతోషంగా ఉన్నారన్నారు.
గడచిన ఐదేళ్లల చంద్రబాబు దొంగ హామీలు, దొంగ దీక్షలు మాత్రమే చేశారని చెప్పారు. ప్రజలకు వాస్తవాలన్ని తెలుసు కాబట్టి ఇటువంటి డ్రామాలకు చంద్రబాబు తెరదించాలని సూచించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు,కార్యకర్తలపై టిడిపి హయాంలో జరిగిన దాడులకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
శాంతియుతంగా పరిపాలన అందించడమే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, పోలీసులకు స్వేచ్చని కల్పించడంతో వారు ప్రశాంతంగా విధులను నిర్వర్తించుకుంటున్నారని పేర్కొన్నారు. పార్టీ మనుగడ కోసం పల్నాడులో చంద్రబాబు చిచ్చుపెడితే కుటుంబాలు నాశనం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
‘మేం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం సుభిక్షంగా ఉంది. చంద్రబాబుకు కేవలం 23 సీట్లు వచ్చినా ఇంకా బుద్ధి రాలేదు. మా ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేస్తే అప్పుడు ఏమైంది మీ లా అండ్ ఆర్డర్ అని ప్రశ్నిస్తున్నా.
రేపు ఛలో ఆత్మకూరుకు టీడీపీ బాధితులంతా వస్తారు. వారికి చంద్రబాబు సమాధానం చెప్పాలి.’అన్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ పాలనలో పల్నాడులో ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. టిడిపి పాలనలో పల్నాడులో 5 గురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దారుణహత్యకు గురయ్యారని గుర్తుచేశారు.
ఛలో ఆత్మకూరుకు తాము తెదేపా బాధితులతో కలిసి వస్తామని కానీ చంద్రబాబు వచ్చేటప్పుడు కోడెలతో పాటు వారి కుటుంబ సభ్యులను, యరపతినేని శ్రీనివాసరావును కూడా తీసుకొస్తే వాస్తవాలు తెలుస్తాయని తెలిపారు. 5ఏళ్ళలో ఏం జరిగిందో...మూణ్ణెలల్లో ఏం జరిగిందో చర్చిద్దామని చంద్రబాబు తప్పనిసరిగా ఆత్మకూరు రావాలని పిలుపునిచ్చారు.
వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ టిడిపి పాలనలో అనేకమంది గ్రామాలను వదలివెళ్లి కూలీలుగా అవతారం ఎత్తారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటి బాధితులు వినుక తాము అధికారంలోకి వచ్చాక మళ్ళీ గ్రామాలను విడిచిన వారు తిరిగి గ్రామాల్లోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
వర్షాల కారణంగా చెరువులు నిండి రైతులు ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటుంటే అలజడులు సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తన ఫ్యాక్టరీని మూసివేయించి తనను జీపులోకి ఎక్కిస్తే అప్పుడు ధర్మాధర్మాలు గుర్తుకు రాలేదా బాబు అని ప్రశ్నించారు.
ధర్మాన్ని అధర్మం, అధర్మాన్ని ధర్మం చేసే అనుభవం బాబుకు మాత్రమే ఉందని అన్నారు. నిజాయితీగా ధర్మపోరాటాలు చేశామని ప్రత్తిపాటి చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రజలను దోచుకున్న యరపతినేని, కోడెలను కూడా పునరావాస కేంద్రంలో పెట్టాల్సిందని ఎద్దేవా చేశారు.