Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గంటా గుడ్ బై...? వైసిపిలోకి గంటా శ్రీనివాసరావు జంప్... నిజమా?

Advertiesment
గంటా గుడ్ బై...? వైసిపిలోకి గంటా శ్రీనివాసరావు జంప్... నిజమా?
, శుక్రవారం, 30 ఆగస్టు 2019 (15:05 IST)
మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసిపిలో చేరేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన బిజెపిలో చేరుతారని కొద్ది రోజుల క్రితం వరకు ప్రచారం జరిగింది. గంటాతో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ మంతనాలు కొనసాగిస్తున్నారు.

బిజెపిలో ఆయనను చేర్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, వ్యక్తిగత కారణాల దృష్య్టా వైసిపిలో చేరేందుకే గంటా మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. పిఆర్‌పిలో ఉన్నప్పుడు సన్నిహితులుగా ఉన్న గంటా, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మధ్య క్రమంగా దూరం పెరిగింది. చివరకు ఎదురుపడినా మాట్లాడుకోని స్థితికి చేరుకుంది.

వైసిపి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గంటా లక్ష్యంగా ముత్తంశెట్టి మాట్లాడడంతో రాజకీయంగా గంటా కొంత ఇబ్బంది పడుతున్నారు. నగరంలోని భూ ఆక్రమణలపై ఇచ్చిన సిట్‌ నివేదికను బహిర్గతం చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పరోక్షంగా గంటానుద్దేశించి వ్యాఖ్యలు చేయడం, గత ఐదేళ్లలో విద్యా శాఖలో ఖర్చు చేసిన నిధులపై విచారణ చేపట్టాలని ఆదేశించడం వంటివన్నీ గంటాకు ఇబ్బందికరంగా మారాయి.

బిజెపిలో చేరే కంటే వైసిపిలో చేరితే తనపై వ్యక్తిగత దాడి తగ్గడమే కాకుండా, రాజకీయంగా నిలదొక్కుకోవచ్చన్న యోచనలో గంటా ఉన్నట్లు తెలిసింది. గంటా చేరికను ముత్తంశెట్టి వ్యతిరేకించినప్పటికీ ఆయనను చేర్చుకోవాలన్న ఆలోచనలో వైసిపి ఉన్నట్లు సమాచారం.

గంటాతో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మంతనాలు జరుపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తరువాత చేర్చుకోవాలని వైసిపి భావిస్తోంది. ముత్తంశెట్టిని ఎదుర్కోవాలన్నా, తనను లక్ష్యంగా చేసుకొని సాగుతున్న ప్రచారానికి అడ్డుకట్టవేయాలన్నా, తనపై ఉన్న కేసులు, ఆరోపణల నుంచి బయటపడాలన్నా వైసిపిలో చేరడమే సరైనదన్న నిర్ణయానికి గంటా వచ్చినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా గంటా సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాక పార్టీలో చేరినా, మళ్లీ ఎమ్మెల్యే పదవికి పోటీ చేయకూడదన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఎమ్మెల్సీగాగానీ, కేబినెట్‌ స్థాయి కలిగిన నామినేటెడ్‌ పదవిగానీ ఇవ్వడానికి జగన్‌ నుంచి హామీ లభిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసిపిలో గంటా చేరనున్నట్లు సమాచారం.

రాబోయే జివిఎంసి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొత్తగా పార్టీలో చేరే వారిని ఆహ్వానించడానికి వైసిపి మక్కువ చూపుతోంది. జివిఎంసిలో పట్టుపెరగాలంటే గంటాను చేర్చుకోవాలని వైసిపి అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది. జగన్‌ నుంచి స్పష్టమైన హామీ లభించిన తరువాత గంటా తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం.

అంతవరకు తనకున్న ప్రాధాన్యత పార్టీలో పోకుండా గంటా వ్యూహాత్మకంగా టిడిపిలో వ్యవహరించనున్నారు. కాగా, వైసిపిలో చేరితే ఆ పార్టీ నాయకులతో కలిసి పనిచేయలేమన్న అభిప్రాయాన్ని గంటా అనుయాయులు వ్యక్తం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజధాని రైతులకోసం ప్రధాని మోదీని కలుస్తా...: సీఎం జగన్‌కు పవన్ వార్నింగ్