Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అరకు ఘటన.. డ్రైవర్‌కు అవగాహన లేదు.. బ్రేక్ ఫెయిల్ అయినా పట్టించుకోలేదు..

Advertiesment
అరకు ఘటన.. డ్రైవర్‌కు అవగాహన లేదు.. బ్రేక్ ఫెయిల్ అయినా పట్టించుకోలేదు..
, శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (22:47 IST)
విశాఖ జిల్లా అరకు ఘాట్‌రోడ్డులో జరిగిన ప్రమాదానికి డ్రైవర్‌ అవగాహనలేమి కారణమని తెలుస్తోంది. డ్రైవర్‌కు ఘాట్‌ రోడ్డుపై అవగాహన లేకపోవడం మూలంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మరోవైపు చీకటి పడడంతో తోవను అంచనా వేయడంలో డ్రైవర్‌ విఫలమై ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ప్రమాద ఘటనలో మృతి చెందిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. 
 
బాధితులంతా అరకు సందర్శన తర్వాత బొర్రా గుహలు చూసి తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సాయంత్రం 5 గంటల సమయంలో తిరుగు ప్రయాణం అవుతున్నట్లు బంధువులకు సమాచారమిచ్చారు. అనంతరం వారి మొబైల్స్‌ స్విచ్‌ ఆఫ్‌ అయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న హైదరాబాద్‌లోని వారి బంధువులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా హైదరాబాద్‌ కలెక్టర్‌ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
 
అలాగే హైదరాబాద్ నుంచి దినేష్ ట్రావెల్స్ బస్సులో అమరావతికి వెళ్లి.. విజయవాడ,పాలకొల్లు,అన్నవరంలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకొని శుక్రవారం ఉదయానికి అరకు చేరుకున్నట్లు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళ తెలిపారు. శుక్రవారం సాయంత్రం 5:30గంటలకు అరకు నుంచి సింహాచలం వెళ్లేందుకు బయల్దేరినట్లు తెలిపారు. అయితే,బస్సు బ్రేక్ ఫెయిల్ అయిందని తెలిసి..తాము బస్సు ఆపమని వారించినా..తమ మాటలను డ్రైవర్ పట్టించుకోలేదన్నారు.
 
తమ మాటలను పట్టించుకోకుండా.. ఆలస్యమవుతుంది అంటూ బస్సును ముందుకు పోనిచ్చాడని తెలిపారు. దీంతోనే ప్రమాదం జరిగిందని తెలిపారు.డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు తెలిపారు. అరకు రూట్ పై డ్రైవర్ కు ఎలాంటి అవగాహన లేదని ప్రయాణికులు తెలిపారు. ఘాట్ రోడ్డులో నడపడం రాదని డ్రైవర్ తమకు ముందే చెప్పలేదన్నారు. అమరావతి నుంచి వచ్చేటప్పుడే తమను డ్రైవర్ చాలా ఇబ్బంది పెట్టాడని ఓ బాధితురాలు తెలిపారు.
 
విశాఖ జిల్లా అరకు ఘాట్ రోడ్డులో పర్యాటకుల బస్సు బోల్తా పడిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 8 మంది మృతి చెందడం బాధాకరం అన్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అరకు లోయలో పడిన బస్సు : 8 మంది మృతి.. సీఎం జగన్ దిగ్భ్రాంతి