Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబు దృఢ వైఖరి చూసి దాచేపల్లి నిందితుడు ఉరేసుకున్నాడు... డొక్కా వ్యాఖ్యలు

అమరావతి : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వేలేక, వెల్లువలా వస్తున్న పెట్టుబడులను అడ్డుకోడానికి ఏపీలో శాంతిభద్రతల సమస్య తలెత్తిందంటూ కేంద్రానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారని ఏపీ శాసనమండలి విప్ డొక్కా మాణిక్యవర

Advertiesment
Dokka Manikyavaraprasad
, మంగళవారం, 17 జులై 2018 (19:59 IST)
అమరావతి : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వేలేక, వెల్లువలా వస్తున్న పెట్టుబడులను అడ్డుకోడానికి ఏపీలో శాంతిభద్రతల సమస్య తలెత్తిందంటూ కేంద్రానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారని ఏపీ శాసనమండలి విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ మండిపడ్డారు. ఇటువంటి కుట్రలు, దుష్ప్రచారాలు మానుకుని, రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని హితవు పలికారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందంటూ కేంద్ర హోం శాఖ మంత్రికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. దొంగే దొంగన్నట్లుగా ఉందన్నారు. 
 
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఆ పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారన్నారు. ఏపీలో శాంతిభద్రతలు లేవని చెబుతూ, రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని చూస్తుండటం సరికాదన్నారు. సామాన్యులపైనా, ప్రజలపైనా వాళ్లే దాడులు చేసి, తిరిగి కేంద్రానికి ఫిర్యాదు చేయడం దారుణమన్నారు. పశ్చిమ బెంగాల్ శాంతి భద్రతలు లేవని ప్రధాని నరేంద్రమోది, ఏపీలో పరిస్థితులు చేయిదాటి పోతున్నాయని ఇక్కడి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అంటున్నారని అన్నారు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో శాంతిభద్రతల పట్ల ఉన్న శ్రద్ధ కాషాయ పార్టీ పాలిత రాష్ట్రాల్లో చూపితే బాగుంటుందని శాసనమండలిలో విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ హితవు పలికారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు, మహిళలపై విచక్షణారహితంగా దాడులు జరుగుతున్నాయన్నారు. 
 
దళితులు, క్రైస్తవులను ఆంగ్లేయులని బీజేపీ ఎంపిలే వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇవేవీ ప్రధాని నరేంద్రమోదికి, కన్నా లక్ష్మీనారాయణకు కనిపించలేదా? అని ప్రశ్నించారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, పాత్రికేయుల హత్యలు బీజేపీ నేతలకు కానరావడం లేదా అని నిలదీశారు. ప్రత్యేక హోదా కోసం ఒంగోలులో ఆర్.ఎం.పి డాక్టర్ ప్లకార్డు పట్టుకుని నిరసన తెలియజేస్తే, ఆయనపై బీజేపీ కార్యకర్తలు, నాయకులు దాడికి పాల్పడ్డారన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించినందుకు బాపట్లలో లారీ డ్రైవర్ పైనా విచక్షణారహితంగా దాడులు చేసింది బీజేపీ నేతలు కాదా? అని ఏపీ శాసనమండలి విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ నిలదీశారు. ఏపీలో శాంతి భద్రతలు భేషుగ్గా ఉన్నాయన్నారు. 
 
శాంతిభద్రతల పరిరక్షణలో సీఎం చంద్రబాబునాయుడి ధృడ వైఖరి చూసి, దాచేపల్లిలో బాలికపై అత్యాచార చేసిన నిందితుడు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. జమ్మూ కశ్మీర్ లో కథువాలో బాలికపై అత్యాచారం జరిపిన నిందితులతో కలిసి బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ర్యాలీలో పాల్గొన్నారన్నారు. ఉత్తరప్రదేశ్ లో విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై బీజేపీ నేతలు దాడులు చేశారన్నారు. నేరస్తులకు వంతపాడడమే బీజేపీ పాలసీయా అని ఆయన నిలదీశారు. ఇప్పటికైనా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు దిగజారడంపై కన్నా లక్ష్మీనారాయణ ఖండించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబునాయుడుపైనా, టీడీపీపైనా ఆరోపణలు చేయడంలో చూపెడుతున్న శ్రద్ధలో పది శాతం రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని హితవు పలికారు. 5 కోట్ల మంది ఆంధ్రుల మనోభావాలను దెబ్బతినేలా కేంద్రానికి ఫిర్యాదు చేసిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తక్షణమే వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఏపీ శాసనమండలి విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో పోతులూరి వీరబ్రహ్మం చెప్పినదే జరుగబోతోందా? దీక్షితులు ఏమన్నారు(Video)