రాష్ట్ర రాజధాని నగరంగా అమరావతిని తీర్చిదిద్దే క్రమంలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 10వేల కోట్లకు పైగానే ఖర్చుచేసింది. మంత్రులు, అధికారులు రాజధాని పనుల నిమిత్తం వివిధ దేశాల్లో చేసిన పర్యటనలు, నిర్వహించిన సదస్సులు, సమావేశాలు, అధ్యయనాల కోసం చేసిన ఖర్చు కలిపితే ఇది మరింత పెరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఒక మహానగరంగా నిర్మించాలని తలపెట్టినప్పటి నుంచి.. ఇప్పటివరకు ఆ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేల కోట్లకుపైగానే వెచ్చించింది. అమరావతిని కేవలం ఒక పరిపాలనా నగరంగా కాకుండా, ఆర్థిక కార్యకలాపాలకు, సంపద సృష్టికి కేంద్రంగా, ఉపాధి అవకాశాలకు నిలయంగా చేయాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం బృహత్తర ప్రణాళికను రూపొందించింది.
2050 నాటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి, నిర్మాణ ప్రణాళికలను సిద్ధం చేసింది. కీలకమైన ప్రణాళికలు, ఆకృతుల రూపకల్పన ప్రక్రియలు ఇప్పటికే పూర్తయి, పనులు కూడా కొనసాగుతున్న తరుణంలో ఇప్పుడు రాజధానిని మరో చోటుకి మార్చడం వల్ల... ఇంతవరకు పెట్టిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరయ్యే అవకాశం ఉందన్న ఆందోళన వివిధ వర్గాల్లో వ్యక్తమవుతోంది.