Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమరావతిని మార్చేందుకే వరద కుట్ర: చంద్రబాబు

Advertiesment
అమరావతిని మార్చేందుకే వరద కుట్ర: చంద్రబాబు
, బుధవారం, 21 ఆగస్టు 2019 (08:12 IST)
ఏపీ రాజధాని అమరావతిపై ప్రభుత్వం ఆలోచిస్తోందని, త్వరలో ఓ కీలక ప్రకటన చేస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు.

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని ఘంటసాల మండలం శ్రీకాకుళంలో వరద బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రాజధాని మార్చాలనే కుట్రతోనే ముంపు ప్రాంతమని చర్చకు తెరలేపారని, ఈ కుట్రలపై ఎంత వరకైనా పోరాడతామని అన్నారు. ఈ కుట్ర, కుతంత్రాలను ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు.

పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, ప్రాజెక్టుల నిర్మాణాలు నిలిచిపోయాయని, ఏ పనీ కావడం లేదని, ప్రజలకు న్యాయం జరిగే వరకూ తాను అండగా ఉంటానని, పోరాడతానని హామీ ఇచ్చారు. ప్రపంచంలోని ఐదు అద్భుత నగరాల్లో అమరావతి ఉండాలనుకున్నామని, ముంపు ప్రాంతం, ఖర్చు నెపంతో అమరావతి నిర్మాణాన్ని ఆపేస్తున్నారని, ఇలాంటి పనులు చేస్తే అమరావతికి పెట్టుబడులు రావని మండిపడ్డారు.

అమరావతికి ఎసరు పెట్టారని, ఇక్కడి పనులు ఆగిపోయాక హైదరాబాద్ లో భూమి విలున ముప్పై శాతం పెరిగిందని అన్నారు. రాజధాని అమరావతి కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని, మౌలిక వసతులు పోగా 8 వేల ఎకరాల వరకూ మిగులుతుందని, ఈ భూమి అమ్మినా ఖర్చు లేకుండా రాజధాని నిర్మించవచ్చని అన్నారు. అవనిగడ్డ వరకూ పంటపొలాలన్నీ మునిగిపోయే పరిస్థితి కావాలని వరద వచ్చే పరిస్థితులను ప్రభుత్వం తీసుకొచ్చిందని దుయ్యబట్టారు.

వరదనీటి నిర్వహణ సరిగ్గా చేసి ఉంటే పంటపొలాలు మునిగేవి కాదని చంద్రబాబు అన్నారు. రాజధానిని, తన నివాసాన్ని ముంచాలని చూస్తే, ప్రజల నివాసాలు మునిగిపోయాయని, ఇది ఎంతో దుర్మార్గమైన చర్య అని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తన నివాసం వద్ద డ్రోన్ ను తిప్పి అది మునిగిపోతుందని చెప్పడం, రాజధాని మునిగిపోయిందని చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసిందని విరుచుకుపడ్డారు.
విజయవాడ నుంచి అవనిగడ్డ వరకూ మొత్తం పంటపొలాలన్నీ మునిగిపోయే పరిస్థితి వచ్చిందని, ఇదంతా చూస్తుంటే తనకు చాలా బాధగా ఉందని అన్నారు. రైతులు తిరిగి కోలుకోలేనంత నష్టం జరిగిందని, అందరూ రోడ్డుపై పడే పరిస్థితి వచ్చిందని అన్నారు. రాజధాని కూడా మునిగిపోతుందని, అందుకే, అభివృద్ధి చేయడం లేదని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోర్న్ సైట్ లో ఫేస్ బుక్ ఫోటోలు.. గూగుల్ కి తెలంగాణ హైకోర్టు నోటీసులు