Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైసీపీ రాబందులు, పందికొక్కుల్లా తినేసిందంతా రావాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గం: దేవినేని ఉమామహేశ్వరరావు

Advertiesment
వైసీపీ రాబందులు, పందికొక్కుల్లా తినేసిందంతా రావాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గం: దేవినేని ఉమామహేశ్వరరావు
, బుధవారం, 26 ఆగస్టు 2020 (05:55 IST)
కాస్త ఆలస్యమైనా న్యాయం, ధర్మమే గెలుస్తాయన్న ముఖ్యమంత్రి మాటలు ఆయనకు, ఆయన ప్రభుత్వానికే వర్తిస్తాయని, పేదలకుచెందాల్సిన ఇళ్లను వారికికేటాయించ కుండా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమో ఆయనే సమాధానం చెప్పాలని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు.

తన బంగ్లాలు, ప్యాలెస్ లు, రాజప్రాసాదాలు కట్టుకోవడానికి వందలఎకరాలు కోరుకునే జగన్, పేదలకు మాత్రం సెంటు స్థలం ఇవ్వడం ఏమిటని, పేదవాడి స్థాయిని సెంటుభూమికి కుదించడం చూస్తేనే జగన్ కు పేదలపై ఎంతప్రేముందో  అర్థమవుతోందన్నారు. ఆయన మంగళగిరి లోని పార్టీ జాతీయకార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

తూర్పుగోదావరిజిల్లాలో ఆవభూములు,  కృష్ణాజిల్లా పెనమలూరులో, శ్రీకాకుళం, విశాఖ, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్ల జరిగిన భూకొనుగోళ్లలో ఎన్నివందలకోట్లు కాజేశారో చెప్పాలన్నారు.  పేదలకు ఇళ్లస్థలాల పేరుతో పాఠశాలలస్థలాలు, అటవీ- ముంపు భూములు, కొండలు, గుట్టలు, చెరువులు, అసైన్డ్ భూములు, శ్మశానాలను పేదలకు ఇచ్చారన్నారు.

జగన్ ప్రభుత్వం తన అసమర్థతను, చేతగాని తనాన్ని ప్రతిపక్షంపై నెట్టాలని చూస్తోందని,  కాస్త ఆలస్యమైనా న్యాయం, ధర్మం గెలుస్తాయన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఆయన ప్రభుత్వానికే వర్తిస్తాయని దేవినేని ఎద్దేవాచేశారు. పేదలు దగ్గరుండి కట్టించుకున్న లక్షలఇళ్లను వారికి కేటాయించకుండా వైసీపీ ప్రభుత్వం దుర్గార్మంగా వ్యవహరిస్తోందన్నారు. 

పేదలు, మధ్యతరగతి వారు అన్నివసతలున్న ఇళ్లలో నివసించడాన్ని జగన్ చూడలేకపోతున్నాడన్నారు.  పేదలకు సెంటు పట్టాభూమిపేరుతో మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, రాబందుల్లా, పందికొక్కుల్లా ప్రజలసొమ్ము తినేశారన్నారు. జగన్ బంగళాలేమో వందల ఎకరాల్లో ఉండాలని, పేదలు మాత్రం సెంటు స్థలంలో ఉండటమేంటని దేవినేని ప్రశ్నించారు.

టీడీపీ ప్రభుత్వం రెండు,రెండున్నర సెంట్లు ఇచ్చిందన్నారు.  తూర్పుగోదావరిలో 600ఎకరాల  ఆవ భూముల్లో  500కోట్ల వరకు స్వాహాచేశారని, పెనమలూరు, మైలవరం నియోజకవర్గాల్లోజరిగిన దోపిడీని కూడా బయట పెట్టామన్నారు.  ప్రభుత్వ దుర్మార్గాలపై  న్యాయస్థానాలకు సమాధానం చెప్పుకోలేక, సిగ్గులేకుండా పాలకులు టీడీపీపై నిందలేస్తున్నారని ఉమా ఆగ్రహం వ్యక్తంచేశారు.

చేతనైతే చేసి చూపించాలని, చేతగాకుంటే తప్పుకోవాలని, అంతేగానీ ప్రతిపక్షాలపై బురదజల్లే కార్యక్రమాలేంటని ఉమా ప్రశ్నించారు. కర్నూలు జిల్లాలో ఆదోని మండలంలో కొండలు, గుట్టల్లో గ్రామానికి కిలోమీటరన్నర దూరంలో సెంటు పట్టా పథకం అమలుచేశారన్నారు. అదే జిల్లాలోని కుందూనది ముంపు ప్రాంతంలో 7వేల మంది పేదలకుఇళ్లస్థలాలిస్తామని చెప్పి, వారిజీవితాలతో చెలగాటమాడుతున్నారని దేవినేని మండిపడ్డారు. 

చిత్తూరుజిల్లా బంగారుపాళ్యంలో 1720మంది లబ్దిదారులకు, 58ఎకరాల కొండలు, గుట్టలున్న ప్రాంతాన్ని పేదలకు ఇళ్లస్థలాలపేరుతో సేకరించారని, శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండలం 75సెంట్ల భూమిని 14లక్షలకు కొని, 40మంది లబ్దిదారులకు పంచుతామని చెబుతున్నారన్నారు. అదేజిల్లాలో 3.60ఎకరాల చెరువుభూమిని ఇళ్లస్థలాలకు ఇవ్వడానికి సిద్ధమైతే, అక్కడున్నవారు కోర్టుకు వెళ్లారని, దాన్ని ఎవరికో ఆపాదించాలని చూడటం సిగ్గుచేటన్నారు.

కృష్ణాజిల్లాలో బుడమేరు ముంపుప్రాంతంలో, చిత్తూరుజిల్లా చంద్రగిరిలో అటవీభూములను కూడా ఇళ్లస్థలాలకు ఇవ్వడానికి సిద్ధమయ్యారన్నారు.  ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన అసైన్డ్ భూములను కూడా లాగేసుకున్నా రన్నారు. ఈవిధంగా అనేకజిల్లాల్లో నివాసయోగ్యం కాని భూములను పేదలకు ఇవ్వడానికి సిద్ధమైన ప్రభుత్వచర్యలను కోర్టులు తప్పపట్టడం జరిగిందన్నారు. 

కోర్టులకు సమాధానం చెప్పుకోలేక, సరైన సమాచారం ఇవ్వలేని జగన్ ప్రభుత్వం, టీడీపీపై నిందలేస్తోందన్నారు.  ఇళ్లస్థలాలకోసం రూ.9వేలకోట్లు ఖర్చుపెట్టామని ముఖ్యమంత్రి చెప్పారని, వాటిలో రూ.3వేలకోట్లకు పైగా అవినీతి జరిగిందని ఉమాస్పష్టంచేశారు. ప్రతి నియోజకవర్గంలో రూ.50 నుంచి రూ.100కోట్ల వరకు దోచేశారని, భూముల మెరకపేరుతో ఉపాధి హామీ నిధులను కూడా దిగమింగారన్నారు.

ఈ భూ బాగోతంపై సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీనేత బొండా ఉమా, మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయడు డిమాండ్ చేస్తే ప్రభుత్వం స్పందించ లేదన్నారు.  ఇళ్లస్థలాల పేరుతో సాగిన దోపిడీపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని జగన్ ను డిమాండ్ చేస్తున్నానన్నారు. సెంటుపట్టా పథకం పేరిట వైసీపీ రాబందులు దోచుకున్నదంతా రాష్ట్ర ఖజానాకు రావాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గమని దేవినేని స్పష్టంచేశారు.

గత ఐదేళ్లలో  టీడీపీప్రభుత్వం లక్షలాది ఇళ్లను నిర్మిస్తే, వాటిని పేదలకు ఇవ్వడానికి  జగన్ ప్రభుత్వానికి ఎందుకు చేతులు రావడం లేదో సమాధానం చెప్పాలని ఉమా డిమాండ్ చేశారు టీడీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 21లక్షల 52వేల 597ఇళ్లకు అనుమతులిచ్చి, 12లక్షల 65వేల 310 ఇళ్లనిర్మాణాన్ని ప్రారంభించి, 7లక్షల 93వేల 998 ఇళ్లను పూర్తిచేసిందన్నారు. 

పూర్తయిన 7లక్షల 93వేల పైచిలుకు ఇళ్లను పేదలకు ఇవ్వడం చేతగాని జగన్ ప్రభుత్వం, ఇళ్లస్థలాల పంపిణీని టీడీపీ అడ్డుకుంటోందంటూ విషప్రచారం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. 300, 365, 400 చదరపు అడుగుల్లో షీర్ వాల్ టెక్నాలజీతో టీడీపీ ప్రభుత్వం రూ.15వేలకోట్లతో ఇళ్లను నిర్మించిందన్నారు. సొంతింటికోసం అప్పులు చేసి మరీ ఇళ్లు కట్టుకున్న 2లక్షల మంది పేదలకు చెల్లించాల్సిన రూ.1100కోట్ల సొమ్ముని కూడా జగన్ ప్రభుత్వం దుర్మార్గంగా నిలిపివేసిందన్నారు.

ఇళ్లస్థలాల పేరుతో, ప్రభుత్వం చేపట్టిన బలవంతపు భూసేకరణ వల్ల  12,366ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలు రోడ్డునపడ్డాయన్నారు. ఆయావర్గాలకు చెందిన భూములను లాక్కొని, వారిని ఉద్ధరిస్తామని చెప్పడం దారుణమన్నారు. పేదలకుఇళ్ల స్థలాల పేరుతో జగన్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలకు అంబేద్కర్ రాజ్యాంగంలో చోటులేదని, ఇటువంటివన్నీ రాజారెడ్డి రాజ్యాంగంలో మాత్రమే జరుగుతాయన్నారు. 

స్వర్ణప్యాలెస్ ఘటనలో రమేశ్ ఆసుపత్రి అంశంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని దేవినేని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి రాజకీయ కక్షతో,  విద్వేషంతో పవిత్రమైన వైద్యవృత్తిలో ఉన్నవారికి కులాలు ఆపాదించి, పట్టుకుంటే లక్షరూపాయలిస్తామని ప్రకటించడం దుర్మార్గమని ఉమా మండిపడ్డారు.

స్వర్ణప్యాలెస్ ఘటనలో చనిపోయినవారి కుటుంబాలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, కక్షతో, ద్వేషంతో రమేశ్ఆసుపత్రిపై పడిందని స్పష్టమవుతోందన్నారు. విచారణ పేరుతో రమేశ్ కుటుంబాన్ని, వారి బంధువులను, వైద్యులను గంటలకు గంటలు వేధించుకుతిన్నారన్నారు.  రమేశ్ తల్లి, 86ఏళ్ల వృద్ధురాలు అని కూడా చూడకుండా, పదిమంది పోలీసులు హైదరాబాద్ వెళ్లి, భయభ్రాంతులకు గురిచేశారన్నారు.

స్వర్ణప్యాలెస్ ఘటనలో కలెక్టర్, సబ్ కలెక్టర్, డీఎంహెచ్ వోల ప్రమేయంపై హైకోర్టు ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారో చెప్పాలన్నారు. ఉత్తర్వులిచ్చిన కలెక్టర్, వాటిని అమలు జరిపిన సబ్ కలెక్టర్, రమేశ్ ఆసుపత్రితో ఒప్పందం చేసుకున్నడీఎంహెచ్ వోల పాత్ర స్పష్టంచేయకుండా, రమేశ్ ఆసుపత్రినే ఎలా బాధ్యులను చేస్తారో సమాధానం చెప్పాలని కోర్టు ప్రశ్నించిందన్నారు.

పోలీస్ యంత్రాంగం, అధికారం చేతిలో ఉన్నాయి కదా అని రమేశ్ ఆసుపత్రిపై, ఆసుపత్రి సిబ్బందిపై, రమేశ్ బాబుపై ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా అని దేవినేని ప్రభుత్వాన్ని నిలదీశారు. స్వర్ణప్యాలెస్ ఘటనలో సంబంధిత అధికారులను బాధ్యులను చేయకుండా, ప్రజల సందేహాలకు సమాధానం ఇవ్వకుండా, ఏకపక్షంగా రమేశ్ బాబుపై అటవికంగా ప్రవర్తించారన్నారు.  అచ్చెన్నాయుడికి రమేశ్ ఆసుపత్రిలో చికిత్స చేశారన్న కక్షతోనే ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందన్నారు. 

ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది నేడు ప్రభుత్వాన్నిప్రశ్నిస్తూ, రోడ్డెక్కారని, వారి సమస్యలు పరిష్కరించకుండా, రమేశ్ ఆసుపత్రిపై కక్షసాధించడం ఏమిటని దేవినేని నిలదీశారు. 
 
రమేశ్ బాబుని చంద్రబాబే తన ఇంట్లో దాచిపెట్టాడంటూ,  కొడాలి నాని చేసిన వ్యాఖ్యలన్నీ ఒళ్లు కొవ్వెక్కి , కళ్లు నెత్తికెక్కి, అహంకారంతో చేసినవేనని దేవినేని మండిపడ్డారు.  కొడాలి నాని తనవ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలన్నారు.  కోర్టులో విచారణ జరుగుతుండగానే,  బాధ్యతగల మంత్రులై ఉండి, అడ్డూఅదుపు లేకుండా కోర్టులపై, ప్రతిపక్షనేతను గురించి దుర్మార్గంగా మాట్లాడారన్నారు.   

ధాన్యపు రైతులకు రూ.239కోట్లు చెల్లించాల్సి ఉందని, ఆరునెలలైనా ఆసొమ్ముని ప్రభుత్వం రైతులకు చెల్లించలేదన్నారు. పసుపు రైతులకు కూడా ఇదేవిధంగా బకాయిలు చెల్లించాల్సి ఉందని, వాటిని కూడా చెల్లించాలన్నారు. సుబాబుల్ ని కొనుగోలు చేసి, సుబాబుల్ రైతులను ఆదోకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు.

ఆరోగ్యశ్రీలో కరోనా నిమిత్తం జగన్ ప్రభుత్వం ఎంత ఖర్చుచేసిందో చెప్పాలని,  కేంద్రం నుంచి వచ్చిన సొమ్మెంత, ఏఏ ఆసుపత్రులు, క్వారంటైన్ కేంద్రాల్లో ఎంతెంత ఖర్చుపెట్టారనే వివరాలతో ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదలచేయాలని  దేవినేని డిమాండ్ చేశారు. కరోనా విషయంలో పాలకుల నిర్లక్షమే పేదల ప్రాణాలు తీసిందని, పేద మధ్యతరగతి కుటుంబాల వారు ఆర్థికంగా చితికిపోయారన్నారు.   

చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఉన్నాడని ఏడ్చేవాళ్లంతా, గడచిన 5ఏళ్లు జగన్ ఎక్కడున్నాడో  చెప్పాలన్నారు. చుట్టపుచూపుగా ధర్నాలు, పాదయాత్రలకు వచ్చిన జగన్ చర్యలను ఎవరూ మర్చిపోలేదన్నారు. కరోనా సమయంలో యువముఖ్యమంత్రి జగన్ కేవలం 5సార్లు మాత్రమే బయటకు వచ్చాడన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మాటలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయన్నారు.   

సీఎఫ్ఎంఎస్ పద్ధతిలో  రూ.649 కోట్లు పొరపాటున డబుల్ పేమెంట్స్ జరిగితే  దానిపై  ఇప్పటివరకు బుగ్గన స్పందించలేదని ఉమా తెలిపారు. సాంకేతిక పొరపాటుతో  రూ.649కోట్లు పొరపాటున చెల్లించామని చెప్పారని, దానికి ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ, ప్రోగ్రామర్లు శ్రీనివాసరావు, రమణారెడ్డి ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలన్నారు.

వారు ముగ్గురు కలిసి ఇష్టారాజ్యంగా కాంట్రాక్లరర్లకు చెల్లింపులు చేస్తున్నారని దేవినేని ఆరోపించారు. బ్యాకెండ్ పేమెంట్స్ లో ఆడిట్ తో సంబంధంలేకుండా, కాంట్రాక్టర్లకు జరిగిన చెల్లింపులపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక దాదాపు రూ.2లక్షలకోట్ల వరకు చెల్లింపులు చేశారని, దానిలో బ్యాకెండ్ పేమెంట్స్ ఎన్నో చెప్పాలన్నారు.

కాగ్ దీనిపై స్పందించి, ప్రభుత్వ రికార్డులను స్వాధీనం చేసుకొని పూర్తిస్థాయిలో విచారించి వాస్తవాలు బయటపెట్టాలని దేవినేని విజ్ఞప్తి చేశారు.  రాష్ట్రంలో 52శాతం అవినీతిని అంతంచేశామంటున్న ముఖ్యమంత్రి, ఆర్థికశాఖలో జరిగిన  అదనపు చెల్లింపులకు బాధ్యులైన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో, ఆర్థికమంత్రి ఎందుకు మీడియా ముందుకు రావడం లేదో సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు హాయాంలో ఆర్థికశాఖలో ఫ్రంట్ ఎండ్స్ పేమెంట్స్ అన్ని కచ్చితంగా చేసిందన్నారు. 
  
ఇసుకమాఫియా చేతిలో హత్యకు గురైన విలేకరి నవీన్
 నందిగామలో ఇసుకమాఫియా చేతిలో విలేకరి గంటా నవీన్ హత్యగావింపబడ్డాడని,  నవీన్ ను హత్యచేసిన ప్రధాన నిందితుడిని ప్రభుత్వం ఇంతవరకూ పట్టుకోలేకపోయిందన్నారు.

కొంతమంది జిల్లా అధికారులు, శాసనసభ్యుడి ఇంటికెళ్లి చర్చించడంపై నవీన్  ప్రశ్నిస్తే, అతన్ని హత్యచేయించారన్నారు. నవీన్ హత్యోదంతంపై ప్రభుత్వసలహాదారు శ్రీరామచంద్రమూర్తిని, దేవులపల్లి అమర్ ను తాను  ప్రశ్నించడం జరిగిందని,  వారిద్దరితో పాటు, జర్నలిజం నుంచి వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి నవీన్ హత్యపై ఎందుకు స్పందించరన్నారు. 

నవీన్ హత్యకేసులో ఎమ్మెల్యే, జిల్లా అధికారి ప్రమేయం ఉందన్న ఉమా,  జర్నలిస్ట్ హత్యకేసు విచారణ చేస్తున్నాడని, నందిగామ డివిజన్ స్థాయిలో పనిచేస్తున్న పోలీస్ అధికారిని బదిలీ చేయించారన్నారు. నవీన్ హత్యకేసుకు చెందిన దోషులను వెంటనే అరెస్ట్ చేసి, పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని దేవినేని డిమాండ్ చేశారు.

ఇసుకమాఫియా ప్రభావం ఏస్థాయిలో ఉందో గోదావరి జిల్లాలో వరప్రసాద్ కు జరిగిన శిరోముండనం ఘటన, కృష్ణాజిల్లాలో జరిగిన విలేకరి హత్యకేసు ఉదంతాలు స్పష్టంచేస్తున్నాయన్నారు.  రీచ్ లలోని ఇసుకను, ఇసుక డిపోల్లోని ఇసుకను వైసీపీనేతలు, రూ.లక్షలకు అమ్ముకుంటున్నారన్నారు. వైసీపీ నేతల కనుసన్నల్లో నాణ్యమైన ఇసుక మొత్తం పక్కరాష్ట్రాలకు తరలిపోతోందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాభాపేక్షతో కరోనా కేర్ సెంటర్ నిర్వహిస్తే కఠిన చర్యలు: ఆళ్ల నాని హెచ్చరిక