రాష్ట్ర మంత్రులు బొత్స, కన్నబాబులు ప్రజారాజధాని అమరావతిని ఉద్దేశించి దుర్మార్గంగా, బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని, కృష్ణానదికి ఇరువైపులా ఎస్సీ నియోజకవర్గాల పరిధిలో, రైతులత్యాగాలతో ఏర్పడిన రాజధానిని ఒక సామాజిక వర్గానికి అంటగట్టడం వారిలోని అజ్ఞానానికి నిదర్శనమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.
సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 29వేల రైతు కుటుంబాలు దేశచరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 33వేల ఎకరాలకు పైగాభూమిని, ఒక నాయకుడిపై నమ్మకంతో రాజధానికోసం, 5కోట్ల ప్రజలకోసం త్యాగం చేశారని, 216 రోజులుగా దళితులు, మైనారిటీలు, రైతులు, మహిళలు రాజధానికోసం పోరాటం చేస్తున్నారని ఉమా పేర్కొన్నారు.
నాడు ప్రతిపక్షనేతగా ఉండి, రాజధాని ఏర్పాటును స్వాగతించిన వ్యక్తి, నేడు ముఖ్యమంత్రి కాగానే తన నిర్ణయానికి కట్టుబడకుండా రాష్ట్ర ప్రజలపై కక్ష సాధింపుధోరణితో ముందుకెళుతున్నాడని ఉమా ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులిచ్చిన భూముల్లో కట్టబడిన హైకోర్టు నేడు రాష్ట్రాన్ని కాపాడుతోందని, అదే ప్రాంతంలో నిర్మించిన సచివాలయం, శాసనసభ, మండలి నుంచే ఈ ప్రభుత్వం పాలనసాగిస్తోందన్నారు.
రాజధానిలో ఉండేది ఒకేసామాజిక వర్గమని, అదంతా ముంపు ప్రాంతమని, శ్మశానమని, ఎడారని, పందులు తిరిగే ప్రదేశమని దుర్మార్గంగా మాట్లాడిన మంత్రే, గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను తలెత్తి చూడటానికి నానా ఇబ్బందులు పడ్డారని దేవినేని ఎద్దేవాచేశారు. ముఖ్యమంత్రి చెప్పారని, ఆయన అనందంకోసం కోట్లాది ప్రజల రాజధాని గురించి చులకనగా మాట్లాడటం తగదన్నారు.
సుమారు రూ.10వేల కోట్లతో అమరావతిలో నిర్మాణాలు పూర్తయ్యాయని, ఐఏఎస్, ఐపీఎస్ ల భవనాలు, సచివాలయ సిబ్బంది భవనాలు, 5వేలమంది పేదలకు ఇళ్లు 90శాతం వరకు పూర్తయితే, వాటిని వినియోగించుకోవడం ఈ ప్రభుత్వానికి చేతగావడం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పుడు ఆరోపణలు చేసినవారు, 14నెలలనుంచీ అధికారంలో ఉండి చివరకు రాజధాని ప్రాంతంలో అవినీతి పేరుతో కొండను తవ్వి ఎలుకను పట్టారని ఉమా దెప్పిపొడిచారు.
తహసీల్దార్ ని, గుమాస్తాని సస్సెండ్ చేసిన ప్రభుత్వం అంతటితో చేతులు దులుపుకుందన్నారు. రాజధానికోసం 68 మంది చేసిన బలిదానాలను కూడా లెక్కచేయకుండా ఈ ప్రభుత్వం ముందుకెళుతోందన్నారు. శాసనమండలి సెలెక్ట్ కమిటీ ముందకు పంపిన బిల్లులను, తిరిగి ఆమోదించి గవర్నర్ వద్దకు పంపిన ప్రభుత్వం రైతులు గుండెలపై తన్నే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.
అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా ఉంటుందో తెలుగుదేశం ప్రభుత్వం చేసి చూపిందని, అందులో భాగంగానే రాష్ట్రానికి కియా, హీరో, అపోలోటైర్స్ వంటి పరిశ్రమలు వచ్చాయన్నారు. ముఖ్యమంత్రి తన అపరిపక్వతతో రాజ్యాంగ పరిధులు దాటి వ్యవహరిస్తూ, రాజారెడ్డి రాజ్యాంగం అమలుచేస్తూ, లేని అధికారాలను ఆపాదించుకుంటూ అధికారమదంతో ప్రవర్తిస్తున్నాడన్నారు.
ఎవరైనా, ఎంతటి వారైనా రాజ్యాంగానికి లోబడే పనిచేయాల్సి ఉంటుందనే విషయాన్ని, పదేపదే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి తెలుసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ, రాజ్యాంగంపై గౌరవం లేకుండా శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లులను, తిరిగి అసెంబ్లీలో ప్రవేశపెట్టి, గవర్నర్ కు పంపడం అన్యాయమన్నారు.
ఎన్టీఆర్ ను గద్దెదింపినప్పుడు ఆనాడు తెలుగుప్రజలు చూపిన పోరాటం ఖండాంతరాలకు వ్యాపించిన విషయాన్ని ఈ ప్రభుత్వం గ్రహిస్తే మంచి దన్నారు. నెలరోజులు తిరక్కుండానే ఎన్టీఆర్ ని తిరిగి ముఖ్యమంత్రి చేసిన చరిత్ర రాజ్యాంగానికి ఉందన్నారు.
నేడు అదేవిధంగా ఒక మూర్ఖపు ప్రభుత్వం, సెలెక్ట్ కమిటీ ముందున్న సీఆర్డీఏ రద్దు, మూడురాజధానుల బిల్లులను ఖాతరు చేయకుండా తిరిగి వాటినే గవర్నర్ కు పంపడం రాజ్యాంగ విరుద్ధం కాదా అని ఉమా ప్రశ్నించారు. రాజ్యాంగ పరిరక్షకుడైన గవర్నర్, మూర్ఖపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పక్కన పెట్టి, వాస్తవాలు తెలుసుకోవాలని మాజీ మంత్రి కోరారు.
రాష్ట్రపతి ఆదేశానుసారం రాజధానిలో హైకోర్టు ఏర్పడిందని, ఢిల్లీని తలదన్నే రాజధాని ఏర్పడుతోందని నాడు ప్రధాని చెప్పారని, అటువంటి రాజధానిని తరలించాలని చూడడం దారుణమన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 13ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన విషయాన్ని గవర్నర్ గుర్తించాలని, ఆర్టికల్ 32ని ఆయన పరిగణనలోకి తీసుకోవాలని దేవినేని విజ్ఞప్తిచేశారు.
పౌరుల ప్రాథమిక హక్కులను లెక్కచేయకుండా ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడుతున్నారని, రాజ్యాంగ పరిధిలోనే వారి అధికారాలుంటాయనే విషయాన్ని వారు తెలుసుకోవాలన్నారు. కోట్లాది ప్రజల గుండెచప్పుడు, రైతుల జీవితాలకు సంబంధించిన అంశంపై తొందరపాటు నిర్ణయాలు తగవన్నారు. దురుద్దేశపూర్వకంగా ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా ఉండాలని, కోట్లాది మంది తెలుగుప్రజల తరుపున ఆయన్ని వేడుకుంటున్నామన్నారు.
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంపై, హైకోర్టుని ధిక్కరించిన ఏపీ ప్రభుత్వం, తిరిగి సుప్రీంకోర్టుకు వెళ్లడం ప్రభుత్వ మొండితనం, తెలివితక్కువతనం, మూర్ఖత్వానికి నిదర్శనమని దేవినేని మండిపడ్డారు. మూడుసార్లు చాలా స్పష్టంగా హైకోర్టు చెప్పినా వినకుండా ప్రభుత్వం తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా వ్యవహరిస్తోందన్నారు.
అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పితాని సత్యనారాయణ కుటుంబంపై, జే.సీ.దివాకర్ రెడ్డి కుటుంబంపై ప్రభుత్వం ఇదేవిధంగా రాక్షసత్వంతో వ్యవహరించిందన్నారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గవర్నర్ ని కలవాలని హైకోర్టు ఆదేశించిన ప్రస్తుత పరిస్థితిలో ఏపీ ప్రభుత్వం, మరలా సుప్రీం కోర్టుని ఆశ్రయించడం ద్వారా రాజ్యాంగ పునాదులను తాకాలని ప్రయత్నిస్తోందన్నారు.
రంగుల అంశం సహా, అనేక అంశాల్లో ప్రభుత్వం కోర్టు ఆదేశాలను ధిక్కరించిందన్నారు. 151సీట్ల మెజారిటీ ఇచ్చిన అహంకారంతో విర్రవీగుతున్న ప్రభుత్వం, కోర్టులను సైతం లెక్కచేయకుండా, న్యాయస్థానాల తీర్పులను అపహాస్యం చేస్తూ, మొండితనంతో, మూర్ఖంగా ముందుకెళుతోం దన్నారు. న్యాయస్థానాల్లో ఉన్న తీర్పులు, కేసులను కూడా లెక్కచేయక పోవడం ఈ ప్రభుత్వానికే చెల్లిందన్నారు.
గతంలో మండలి సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లులను తిరిగి ఆమోదించి, గవర్నర్ కు పంపడం, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గవర్నర్ ని కలుస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లడం ద్వారా ఈ ప్రభుత్వం రాజ్యాంగవ్యవస్థలను అపహాస్యం చేస్తోందని దేవినేని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం తన చర్యలకు తగిన మూల్యం చెల్లించడం ఖాయమన్నారు.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంటే, నిన్నటికి నిన్న రాష్ట్రంలో ఒకేరోజు 5041కేసులు నమోదైనా, 56మంది మరణించినా ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వపెద్దలు, అధికారులు తమ అలసత్వాన్ని వీడటంలేదన్నారు. ముఖ్యమంత్రి ఇన్నిరోజులుగా ఒక్క క్వారంటైన్ కేంద్రాన్ని కూడా సందర్శించలేదని, కరోనా వైద్యసేవలందించే ఒక్క ఆసుపత్రిని కూడా ఆయన పరిశీలించలేదన్నారు.
పక్కరాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు 70ఏళ్ల వయసులో కూడా ప్రజల కోసం పనిచేస్తుంటే, ఈ ముఖ్యమంత్రి తాడేపల్లిలో పబ్జీగేము ఆడుకుంటూ కాలయానపన చేస్తున్నాడన్నారు. పేదలకు ఉపాధిలేక వారంతా ఇబ్బందులు పడుతున్నా, ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించడం లేదనన్నారు. ఇద్దరు మంత్రులు, ప్రజాప్రతినిధులు కరోనా బారినపడినా ప్రభుత్వం, ప్రజల గురించి పట్టించుకోవడం లేదన్నారు.
ఇబ్రహీంపట్నంలో ముఖ్యమంత్రి పాల్గోనబోయే మొక్కలు నాటే కార్యక్రమం కోసం అధికారులు, మంత్రులు, వైసీపీనేతలు విచ్చలవిడిగా తిరుగుతూ, కోవిడ్ నిబంధనలను పాటించకుండా, మాస్కులు ధరించకుండా, కరోనా వ్యాప్తికి తమవంతు సహాకారం అందించడం సిగ్గుచేటని ఉమామండిపడ్డారు.(ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన విలేకరు లకు చూపించారు).
22వతేదీన ముఖ్యమంత్రి జగన్, చంద్రబాబు ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్లసముదాయాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారని, ఇళ్లస్థలాల కోసం రూ.7,500కోట్లు ఖర్చుచేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వానికి మొక్కలు నాటడానికి 13జిల్లాల్లో ఎక్కడా స్థలం దొరకలేదన్నారు.
కొండల్లో , కోనల్లో, గుట్టల్లో, ముంపుభూముల్లో, శ్మశానాల్లో పేదలకు ఇళ్ల పట్టాలివ్వబట్టే, ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి ఎక్కడా మొక్కలు నాటడానికి అనువైన స్థలం దొరకలేదని దేవినేని ఎద్దేవాచేశారు. కరోనా నిబందనలు పాటించకుండా ప్రభుత్వంలోని వారే, విచ్చలవిడిగా వ్యవహరిస్తే, సామాన్య ప్రజలు జాగ్రత్తలు ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు.
ఇబ్రహీంపట్నంలోని నిమ్రా కాలేజీలో మైనారిటీ విద్యార్థులు విధ్యాభ్యాసం చేయకుండా, అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్న జగన్ ప్రభుత్వం, అక్కడ క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటుచేసిందన్నారు. కరోనా బారిన పడి చికిత్సపొందుతున్న వారిని ముఖ్యమంత్రి పరిశీలించాలని, వారికి అందుతున్న సేవలను ఆయన తెలుసుకోవాలని ఉమా సూచించారు.
నిమ్రా కాలేజీలో హెలీప్యాడ్ ఏర్పాటు చేస్తే, మైనారిటీ విద్యాసంస్థను ఎందుకు మూసేయించారో మైనారిటీలకు సమాధానం చెప్పాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి హెలీప్యాడ్ ను పవిత్ర సంగమం వద్ద ఏర్పాటు చేశారన్నారు.
వీటీపీఎస్ లో పనిచేస్తూ, ఉద్యోగాలు కోల్పోయిన వారు, వైసీపీనేతలు ఎన్నికల సమయంలో పంచిన చించిననోట్లు తీసుకున్న అమాయకులు ముఖ్యమంత్రి రాకకోసం ఎదురుచూస్తున్నారని, వారందని ఆయన స్వయంగా పలకరిస్తే, వారంతా సంతోషిస్తారని దేవినేని సూచించారు.
రూ.1600కోట్లతో చంద్రబాబు ప్రభుత్వం పవిత్రసంగమం వద్ద తలపెట్టిన బ్రిడ్జి నిర్మాణ ప్రాంతాన్ని కూడా ముఖ్యమంత్రి సందర్శించాలని, చంద్రబాబు పట్టుదలతో గోదావరి నీరు పవిత్ర సంగమం వద్ద కలిసే ప్రదేశాన్ని ఆయన చూసినట్లయితే జగన్ జన్మ తరిస్తుందని దేవినేని దెప్పిపొడిచారు. వైకుంఠపురం బ్యారేజీ శంకుస్థాపన ప్రదేశాన్ని కూడా జగన్ చూడాలన్నారు. 14నెలల్లో ప్రభుత్వం చేసిన ప్రజావేదిక విధ్వంసం కూడా ముఖ్యమంత్రికి హెలీకాఫ్టర్ నుంచి కనిపిస్తుందన్నారు.
సీతారామయ్య మరణం బాధ కలిగించింది....
ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్, తత్వవేత్త, విజ్ఞానజ్యోతి సంస్థ ట్రెజరర్ గా విశేష సేవలందించిన దేవినేని సీతారామయ్య గారి మృతిపట్ల దేవినేని తీవ్ర విచారం వెలిబుచ్చారు. సీతారామయ్య టీటీడీ ఛైర్మన్ గా విశేష సేవలందించారన్నారు. తమకు, తమ కుటుంబానికి మార్గదర్శకులుగా నిలిచారని, వారి మరణం తనకు చాలా బాధ కలిగించిందన్నారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని భగవంతుడిని వేడుకుంటున్నానన్నారు.