ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధి హమీ పనుల తనిఖీల కోసం విజయనగరం జిల్లాకు వచ్చిన కేంద్ర బృందానికి కాంట్రాక్టర్లు వినతి అందించారు. పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ది జాయింట్ సెక్రటరి రోహిత్ కూమార్ ను, రాష్ట్ర ఉపాధి హమీ మండలి మాజీ సభ్యులు కలిసి వినతి పత్రం అందించారు.
ఉపాధి హమీ పధకంలో 2018-19 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన గ్రామీణ అభివృద్ది పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.1845 కోట్లను మూడు విడుతలగా విడుదల చేయగా, రాష్ట్ర వాటాగా 615 కోట్లు కలిపి మొత్తం 2460 కోట్లు పనులు చేసిన వారికి ఇంత వరకు బిల్లులు చెల్లించలేదని ఫిర్యాదు చేశారు. నరేగా పనులు చేసిన వారు అప్పుల పాలయ్యారని, కొందరు తమ ఆస్తులను అమ్మి అప్పులు తీర్చగా, మరి కొందరు తమ ఆస్తులను తాకట్టు పెట్టారని వివరించారు. కొంత మంది అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని సభ్యులు తెలిపారు. ఇప్పటికే పలు మార్లు కోర్టు, బిల్లులు చెల్లింపులు జరపాలని ఆదేశించినా, కేవలం ఇప్పటి వరకు నామమాత్రంగా 1,123 కోట్లు మాత్రమే నిధులు విడుదల చేశారని, వాటినీ ఇప్పటి వరకు పనులు చేసిన వారి ఖాతాలకు జమ చేయలేదని తెలిపారు.
12,000 పనులకు విజిలెన్స్ ఎంక్వెరీ పేరుతో 21 శాతం నుండి 95 శాతం వరకు కోత విధించటం వల్ల పనులు చేసిన వారు 700 కోట్లు నష్టపోయారని తెలిపారు. ఇప్పటికే క్వాలీటి కంట్రోల్ పరిశీలన పూర్తి అయి, సోషల్ అడిట్ జరిగి, నేషనల్ రూరల్ డెవలప్మెంట్ ఇనిస్ట్యూట్ పరీశీలన చేసి కేంద్ర ప్రభుత్వం అవార్డ్ పోందిన పనులకు కూడా, విజిలెన్స్ ఎంక్వెరీ కోత పెట్టడం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా జరుగుతోందని ఆరోపించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోని పనులు చేసిన వారికి బిల్లులు చెల్లింపులు జరిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నియోజకవర్గాలలో పూర్తి చెల్లింపులు జరిపి, మిగిలిన నియోజకవర్గాలలో బిల్లులు తగ్గించి చెల్లించడం ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచినట్లు అని అన్నారు. బిల్లులు ఎలాంటి కోతలు లేకుండా ఆలస్యం అయిన బిల్లులకు వడ్డీతో సహా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర బృందాన్ని కోరారు.
దీనికి కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ది జాయింట్ సెక్రటరి రోహిత్ కూమార్ సానుకూలంగా స్పందించి, పై సమస్యలన్నీ తమ దృష్టిలో ఉన్నాయని, పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారు.