ఐపీఎల్ టోర్నీ కోసం భారత్ క్రికెట్ జట్టు సరికొత్త డ్రామాకు తెరతీసిందంటూ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ ఆరోపించారు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన ఐదో టెస్ట్ వాయిదాపడింది. దీనిపై మైఖేల్ వాన్ స్పందిస్తూ, లీగ్‌లో ఒక్క మ్యాచ్‌కు కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకే భారత క్రికెటర్లు చివరి టెస్టు నుంచి తప్పుకున్నారని, వారికి దేశం తరపున ఆడే టెస్ట్ మ్యాచ్ కంటే ఐపీఎల్ మ్యాచ్‌లంటేనే ముఖ్యమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కోవిడ్ టెస్ట్ నెగెటివ్ రిపోర్టు వచ్చాకే యూఏఈ బయల్దేరిన కోహ్లీ అండ్ కో అదే రిపోర్టుతో ఒక రోజు ఆలస్యంగా టెస్ట్ ఆడితే ఏమయ్యేదంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ కాకుండా చివరకు డబ్బు గెలిచిందని ఘాటుగా విమర్శించారు. టీమిండియా ఆటగాళ్లలో కరోనా సోకుతుందేమోనన్న భయం కంటే ఐపీఎల్‌కు దూరమవుతామనే ఆందోళన ఎక్కువైందని, అందువల్లే మాంచెస్టర్ టెస్ట్ రద్దయిందని మైఖేల్ వాన్ ఆరోపించారు.