చలికి భాగ్యనగరం గజగజ వణికిపోతోంది. 25 యేళ్ళనాటి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. పెథాయ్ తుఫాన్, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో మూడు రోజులుగా చలి విపరీతంగా పెరిగింది. చివరకు మధ్యాహ్నం సమయంలోనూ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. చలి తీవ్రత తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 31 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు.
బంగాళాఖాతం నుంచి చలి గాలుల ప్రభావం రాజధానిపై ఎక్కువగా ఉండటం వల్లే చలి ఎక్కువగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 18వ తేదీన హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం పూట గరిష్ట ఉష్ణోగ్రత 19.8 డిగ్రీలుగా నమోదైంది. ఇది 25 ఏళ్ల క్రితం నాటి రికార్డుకు సమానమని వాతావణశాఖ అధికారులు చెబుతున్నారు. 1993 డిసెంబరు 6వ తేదీన పగటిపూట 19.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వారు గుర్తుచేశారు.
సాధారణంగా పగటిపూట 29 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. కానీ, ఇది ఒక్కసారిగా 19 డిగ్రీలకు పడిపోయింది. హన్మకొండ, నిజామాబాద్‌లలో కూడా సాధారణం కంటే 10 నుంచి 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గడం మరో రికార్డుగా చెబుతున్నారు. బుధవారం మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలకు పెరిగాయి. మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలో 24.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే, ఆదిలాబాద్ జిల్లాలో తెల్లవారుజామున అతి తక్కువగా 5 డిగ్రీలు నమోదైంది. ఇది ఈ సీజన్‌లోనే అతి తక్కువ ఉష్ణోగ్రతగా వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.