జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై కార్యాచరణ (జగనన్న స్వచ్ఛ సంకల్పం)తో పాటు, వైఎస్సార్ జలకళ, గ్రామీణ తాగునీటి సరఫరా (జల్‌జీవన్ మిషన్-జేజేఎం), వీధుల్లో ఎల్‌ఈడీ లైటింగ్ (జగనన్న పల్లె వెలుగు), గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంపై సమీక్ష జరిపారు. సమీక్ష సమావేశంలో సీఎం జగన్ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో శానిటేషన్ చాలా ముఖ్యం. క్లాప్ (క్లీన్ ఆంధ్రప్రదేశ్).. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ జయంతి రోజు జూలై 8న ప్రారంభం అవుతుంది అని సీఎం జగన్ తెలిపారు. గ్రామాల్లో ఎక్కడా మురుగునీరు కనిపించకూడదని స్పష్టం చేశారు. సీవేజ్ పంపింగ్ ఎలా ఉంది? ఆ నీటిని ఎలా డిస్పోస్ చేయడం ఎలా అనేది చూడాలని అధికారులకు సూచించారు.
మురుగునీటిని ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి మున్సిపాలిటీ, పంచాయతీలలో పారిశుద్ధ్య కార్మికులకు వాక్సినేషన్ మొదలు, యూనిఫామ్, గ్లౌజ్‌లు, మాస్క్‌లు, కోట్స్ అన్నీ అదనంగా ఇవ్వాలని స్పష్టం చేశారు. మన ఊరును మనమే పరిశుభ్రంగా చేసుకుందాం అనే నినాదంతో జగనన్న స్వచ్ఛ సంకల్పం అమలు చేయాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.
ఈ-వాహనాల నిర్వహణ భారం కాకుండా చూసుకోవాలని, గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలపైనే ఎక్కువ వ్యయం చేయాలని తెలిపారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్‌లో గ్రామాలు, పట్టణాల్లో పూర్తి పారిశుద్ధ్యం కోసం మున్సిపల్ విభాగం కూడా పంచాయతీరాజ్‌తో కలిసి పని చేయాలని సూచించారు. మనసా వాచా కర్మణా ఈ కార్యక్రమాన్ని సొంతం చేసుకోవాలని చెప్పారు. మే 1వ తేదీ నుంచి వంద రోజుల పాటు గ్రామాల్లో పారిశుద్ధ్యంపై కార్యాచరణ చేపడుతున్నట్లు సమావేశంలో అధికారులు వెల్లడించారు.