Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హోరెత్తిన అమరాతి రైతుల ఉద్యమం.. పండగ పూట పస్తులు - చంద్రబాబు కూడా..

webdunia
బుధవారం, 15 జనవరి 2020 (17:30 IST)
రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు కొనసాగిస్తున్న ఆందోళన సంక్రాంతి పండగపూట కూడా కొనసాగింది. రాజధాని ప్రాంతానికి చెందిన 29 గ్రామాల రైతులు, మహిళలు మందడంలో ఆందోళన చేశారు. రాజధానిని మార్చొద్దు అంటూ తమ నిరసన వ్యక్తంచేశారు. పైగా, మూడు వద్దు ఒకటే ముద్దు అంటూ నినాదాలు చేశారు. అంతేకాకుండా సంక్రాంతి పండగ అని కూడా చూడకుండా వారు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపడమే కాకుండా, పస్తులున్నారు. వీరితో పాటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ధర్నాలో కూర్చొన్నారు. 
 
ఈసందర్భంగా చంద్రబాబు నాయుడు రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, అమరావతి ఓ శక్తిపీఠం అని, దాన్ని తీసే శక్తి ఎవరికీ లేదని స్పష్టంచేశారు. రాజధాని రైతులు సీఆర్డీఏతో ఒప్పందం చేసుకున్నారని, ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసే హక్కు ప్రభుత్వానికి లేదని చెప్పుకొచ్చారు. అమరావతి రైతులకు అన్ని హక్కులు ఉన్నాయని, సీఆర్డీఏ పరిధిలో నవ నగరాలు వస్తాయని చెప్పామని వివరించారు. అమరావతి, పోలవరాన్ని రెండు కళ్లుగా భావించానని, అమరావతి కోసం 18 మంది రైతులు చనిపోవడం ఎంతో బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. 
 
రైతులకు 200 గజాలు ఎక్కువ ఇస్తామని ఓ మంత్రి చెబుతున్నారని, అమరావతి 29 గ్రామాల సమస్య కాదని, ఐదు కోట్ల మంది ప్రజల సమస్య అని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని, దాని ఆటలు ఇక సాగనివ్వబోమని హెచ్చరించారు. వైసీపీ తప్ప అన్ని పార్టీలు అమరావతికి మద్దతిస్తున్నాయనే విషయాన్ని పాలకులు గుర్తుపెట్టుకోవాలన్నారు. పదవుల కోసం ప్రజలను తాకట్టుపెడితే చరిత్ర క్షమించదని హెచ్చరించారు. అమరావతి కోసం జీవితంలో తొలిసారి జోలె పట్టానని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
 
తమ హయాంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి శ్రీకారం చుట్టామని, ఉత్తరాంధ్రకు పరిశ్రమలు వచ్చి, తద్వారా అక్కడివారికి ఉపాధి లభించాలన్నది తమ ఆకాంక్ష అని తెలిపారు. విశాఖ జిల్లాకు ఎన్నో పరిశ్రమలు తెచ్చానని, ఇప్పుడవన్నీ పారిపోయాయని అన్నారు. రాజధాని మార్పు అంటూ అగ్గితో చెలగాటమాడుతున్నారని, భస్మమైపోతారంటూ హెచ్చరించారు. విశాఖ వాసులు రాజధానిని కోరడం లేదనీ విశాఖను ఐటీ హబ్‌గా మార్చాలని కోరుతున్నారని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలన్నదే తమ అభిమతమన్నారు. 
 
ఈ సారి తాను సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పబోనని, ఈ ఏడాది కష్టాల సంక్రాంతి జరుపుకుంటున్నామని అన్నారు. రైతులకు మద్దతు ఇచ్చేందుకే ఈ రోజు తమ కుటుంబ సభ్యులం మందడానికి వచ్చామని చంద్రబాబు చెప్పారు. రాజధాని అనేది ఐదు కోట్ల ఆంధ్రులకు సంబంధించిన విషయమని రాష్ట్ర ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలని అన్నారు. గట్టిగా పోరాడి అమరావతి రాజధానిని సాధించుకుందామని చెప్పారు.
 
అధైర్య పడి ఎవరూ ప్రాణ త్యాగాలు చేయొద్దని చంద్రబాబు అన్నారు. అమరావతిలో తాను కట్టిన ఏసీ రూముల్లో ప్రభుత్వ నేతలు ఉంటున్నారని, మరోవైపు అమరావతిలో నిర్మాణాలే జరగలేదని, గ్రాఫిక్స్ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. వైకాపా నేతలు తనను, పవన్ కళ్యాణ్‌ను తిడుతూ పబ్బంగడుపుతున్నారని మండిపడ్డారు. రాజధానిలో రైతు కూలీలకు పెన్షన్లు కూడా ఇచ్చామని చెప్పారు. నీళ్లు ఇస్తే రాయలసీమ అభివృద్ధి చెందుతుందని, తాము రూ.65 వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్ట్‌లు పూర్తి చేశామని చంద్రబాబు గుర్తుచేశారు. 

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

ఏపీలో స్థానిక సమరానికి బ్రేకులు వేసిన సుప్రీంకోర్టు