Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాష్ట్రంలో అలజడికి చంద్రబాబు కుట్ర: ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి

రాష్ట్రంలో అలజడికి చంద్రబాబు కుట్ర: ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి
, శనివారం, 2 జనవరి 2021 (19:57 IST)
ఆలయాల్లో విధ్వంసాలు చేయించడం ద్వారా రాష్ట్రంలో అలజడి రేపి తాను రాజకీయంగా బలపడాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఆరోపించారు. రామతీర్థం ఆలయాన్ని సందర్శించిన సమయంలో ఎంపి విజమసాయి రెడ్డి వాహనంపై  టీడీపీ శ్రేణులు రాళ్లు, చెప్పులతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది టీడీపీ రౌడీ రాజకీయానికి నిదర్శనమని అభివర్ణించారు.

విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో శనివారం జరిగిన రాజకీయగొడవల నేపథ్యంలో మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పుష్ప శ్రీవాణి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రామతీర్థం గురించి మాట్లాడే హక్కు కూడా చంద్రబాబు నాయుడుకు లేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే రామతీర్థం అభివృద్ధికి చర్యలను చేపట్టడం జరిగిందని చెప్పారు.

రామతీర్థంలో రాముల వారి విగ్రహాన్ని విధ్వంసం చేసింది కూడా టీడీపీకి చెందిన వారేనని ఆరోపించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విజయనగరం జిల్లాలో పర్యటించడానికి ఒక్క రోజు ముందుగా రామతీర్థంలో విగ్రహాన్ని ధ్వంసం చేయడం వెనుక కూడా ముఖ్యమంత్రి పర్యటనలోనూ గొడవలు సృష్టించాలనే కుట్ర ఉందని ఆరోపించారు.

ఈ విషయం పోలీసుల విచారణలో బయటపడుతుందనే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు రామతీర్థాన్ని సందర్శించే కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. రాష్ట్రంలోని ఆలయాలలో విధ్వంసాలు చేయించడం ద్వారా రాష్ట్రంలో గొడవలు రేపి తద్వారా తాను రాజకీయంగా బలపడాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

రామతీర్థం ఆలయాన్ని సందర్శించిన సమయంలో ఎంపీ విజయసాయి రెడ్డి వాహనంపై టీడీపీ శ్రేణులు రాళ్లు, చెప్పులతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించిన పుష్ప శ్రీవాణి రాష్ట్రంలో టీడీపీ సాగించాలని చూస్తున్న రౌడీ రాజకీయానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి సంక్షేమానికి పాటు పడుతోందని, వినూత్న పథకాల ద్వారా అపార ప్రజాదరణను చూరగొంటోందని ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని తప్పు పట్టేందుకు ఏ అంశం లేకపోవడంతో ఆలయాల్లో విధ్వంసాలు చేయడం ద్వారా రాష్ట్రంలో అలజడిని సృష్టించి ప్రజల దృష్టిని మళ్లించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని పుష్ప శ్రీవాణి ఆరోపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి