తెలుగు తమ్ముళ్లకే ఎన్టీఆర్ గృహాలా? మంత్రి కాలవ సమాధానం
ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణాలపై లబ్ధిదారులు 86 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారని గ్రామీణ గృహనిర్మాణ శాఖా మంత్రి కాలవ శ్రీనివాసులు సభకు తెలిపారు. వర్షాకాల సమావేశాల సందర్భంగా శాసనమండ
ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణాలపై లబ్ధిదారులు 86 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారని గ్రామీణ గృహనిర్మాణ శాఖా మంత్రి కాలవ శ్రీనివాసులు సభకు తెలిపారు. వర్షాకాల సమావేశాల సందర్భంగా శాసనమండలిలో మంగళవారం గ్రామీణ గృహనిర్మాణంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలు ఇచ్చారు. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ గృహాలు కేవలం జన్మభూమి కమిటీ సభ్యలు సిఫారసు చేసిన తెలుగు తమ్ముళ్లకు మాత్రమే మంజూరు చేస్తున్నారని ఆరోపించగా.. రాష్ట్రంలోని అర్హులైన తెలుగు చెల్లెమ్మలకూ మంజూరు చేస్తున్నామని చెప్పారు.
రియల్‌టైమ్ గవర్నెన్స్ నిర్వహించిన సర్వేలో ఇళ్ల మంజూరు, బిల్లుల చెల్లింపులో అవినీతి లేదని 96 శాతం తేల్చి చెప్పారని, ఇదే పారదర్శకతకు నిదర్శనమని మంత్రి చెప్పారు. పేదలకు శాశ్వత ఆవాసం కల్పించాలని లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ స్థాపించిన అన్న ఎన్టీఆర్ ఆశయసాధనకు కృషిచేస్తూ.. పేదలకు అత్యధిక సంఖ్యలో పక్కా ఇళ్లు కట్టిస్తున్న మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని మంత్రి తెలిపారు. ఇప్పటివరకూ గ్రామీణ ప్రాంతాల్లో వివిధ పథకాల కింద రూ13, 911 కోట్ల నిధులతో 11,15,452 ఇళ్లు మంజూరు చేశామన్నారు.
రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని పేదలకు రూ. 20,217 కోట్లతో 13,28,965 ఇళ్లను నిర్మిస్తున్నామని మంత్రి సభ దృష్టికి తీసుకొచ్చారు. నాలుగేళ్ల కాలంలో రూ.6857 కోట్ల ఖర్చుతో 6,46,086 గృహాలు పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పామన్నారు. ఇటీవల కాలంలో ప్రధానమంత్రి గుజరాత్‌లో ఒక లక్ష గృహాలను ప్రారంభిస్తూ చేసిన ప్రసంగాన్ని మంత్రి కాలవ సభలో చదివి వినిపించారు. కలలను ఒకనిర్ణీత గడువులోగా నెరవేర్చుకోవాలని ప్రధానమంత్రి అన్నారని...కేంద్రం సహకరించకుంటే కలలను రాష్ట్రాలు ఎలా సాకారం చేసుకుంటాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే ద్వారా 20 లక్షల మందిని అర్హులుగా గుర్తించి ఇళ్లు కావాలని కేంద్రానికి నివేదిస్తే.. 1 లక్షకు పైగా ఇళ్లను మాత్రమే మంజూరు చేశారని..ఇది వివక్ష కాదా అని ప్రశ్నించారు.
అర్హులైన గ్రామీణ ప్రాంత పేదలందరికీ ఇళ్లు ఇస్తామని ప్రకటించిన కేంద్రం ఇళ్ల మంజూరులో ఉత్తరాది, దక్షిణాది మధ్య వ్యత్యాసం చూపిస్తోందని మంత్రి గణాంకాలతో సహా వివరించారు. భారతదేశం జనాభాలో గ్రామీణ జనాభా 83 కోట్ల పైగా ఉండగా, దక్షిణాది రాష్ట్రాల గ్రామీణ జనాభా 14 కోట్లకు పైగానే ఉందన్నారు. ఇది దేశగ్రామీణ జనాభాలో 17.08 శాతమని మంత్రి చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలకు కేటాయించిన 6.9 శాతం మాత్రమేనని మంత్రి వివరించారు. మధ్యప్రదేశ్లో 13,99,084 , చత్తీస్‌ఘడ్ కి 7,88,235, ఉత్తరప్రదేశ్లో 11,71,852, బీహార్ కు 11,76617, రాజస్థాన్ 6.87,091 గృహాలు మంజూరు చేసిన కేంద్రం దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడుకు 3,27,552, కర్ణాటకకు 1,45,349, కేరళకు 42,431 ఇళ్లు మంజూరు చేసిందని, ఆంధ్రప్రదేశ్‌కు 1 లక్ష ఇళ్లే మంజూరు చేశారని మంత్రి వివరించారు.
గతంలో ఇంటి నిర్మాణానికి 450 గజాలుంటే ప్రస్తుతం 750 గజాలుగా మార్పు చేశామని తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.1480 కోట్లు ప్రత్యేకంగా కేటాయించామన్నారు. కేంద్రం సహకారం లేకపోయినా, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా నిరుపేదలకు శాశ్వత ఆవాసం కల్పించడంలో పారదర్శకంగా, ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ గృహనిర్మాణం సాగుతోందని మంత్రి వివరించారు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అవకతవకలు లేకుండా పకడ్బందీగా నిబంధనలు అమలు చేస్తూనే, అర్హుల గుర్తింపు అంతా ఆన్‌లైన్ ద్వారా చేస్తున్నారని, బిల్లులు కూడా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు అక్కౌంట్లకే జమ చేస్తున్నారని మంత్రి వివరించారు.