నాలుగేళ్ల చిన్నారికి ఈత నేర్పడానికి వెళితే...

శుక్రవారం, 11 అక్టోబరు 2019 (07:52 IST)
ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారికి ఈత నేర్పాలని తండ్రి చేసిన విఫలయత్నం పసిప్రాణాన్ని బలిగొంది.

లోతైన బావిలోని బురదలో చిక్కుకుని పాప కన్నుమూసింది. అనంతపురం జిల్లా యాడికి మండలం కేసవరాయుని పేట గ్రామంలో నాన్న, నాన్నమ్మల నిర్లక్ష్యం కారణంగా 4 ఏళ్ల చిన్నారి బావిలో పడి మృతి చెందింది. గ్రామానికి చెందిన మహేశ్వరరెడ్డి... తన తల్లి, ఇద్దరు కుమార్తెలతో కలసి తోట వద్దకు వెళ్లారు. అక్కడ పనులు ముగిసిన తర్వాత పెద్ద కుమార్తెకు ఈత నేర్పేందుకు బావిలోకి దిగారు.

ఆ సమయంలో చిన్నకూతురు జాహ్నవి(4) నాన్నమ్మతో కలసి బావిపైన ఉంది. ఆ సమయంలో ఈత నేర్పుతా బావిలోకి దూకమని జాహ్నవికి మహేశ్వరరెడ్డి చెప్పాడు. వెంటనే చిన్నారిపై నుంచి బావిలోకి దూకింది. మహేశ్వరరెడ్డి జాహ్నవిని పట్టుకోలేకపోవటంతో నీటిలో మునిగిపోయింది. ఎంత సేపు వెతికినా కనిపించలేదు.

విషయం తెలుసుకున్న గ్రామస్థులు, పోలీసు, అగ్నిమాపక అధికారులు కలసి పాప కోసం బావిలోకి దిగి గాలించారు. అయినా ఫలితం లేకపోవటంతో మూడు మోటార్ల సాయంతో దాదాపు 8 గంటల పాటు బావిలోని నీటిని బయటకు తోడారు. చివరకి జాహ్నవి బావి అడుగున బురదలో చిక్కుకుని కనిపించింది. చిన్నారి మృతదేహం చూసి గ్రామస్థులంతా కన్నీటి పర్యంతం అయ్యారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం తెలంగాణలో సమ్మె మరింత ఉద్ధృతం